ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం
By సుభాష్ Published on 18 Oct 2020 11:10 AM IST
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడులోని ఎస్వీఆర్ సెంటర్‌కు వచ్చే సరికి బస్సు వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. బస్సు టైర్ పగలడంతో.. ఆ ధాటికి ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి.
దీంతో.. బస్సులో పొగ కమ్ముకోవడంతో.. అందులో ఉన్న ప్రయాణికులకు ఒక్కసారిగా ఏమి జరిగిందో తెలియక ఆందోళన చెందారు.
కొందరు ప్రయాణికులు బస్సు కిటికీ నుండి కిందకు దూకారు. మంటలను గమనించిన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో.. ప్రయాణికులంతా కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన జాతీయ రహదారిపై జరగడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు.. అక్కడకు చేరుకుని ట్రావెల్స్ బస్సును రోడ్డు ప్రక్కకు జరిపి.. వాహన రాకపోకలను పునరుద్దరించారు. ప్రయాణీకులు వేరు వేరు వాహనాల్లో వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు.