15 మంది ఐఎస్‌ ఉగ్రవాదులకు జైలు శిక్ష.. దోషుల్లో ముగ్గురు హైదరాబాదీలు

By సుభాష్  Published on  18 Oct 2020 4:18 AM GMT
15 మంది ఐఎస్‌ ఉగ్రవాదులకు జైలు శిక్ష.. దోషుల్లో ముగ్గురు హైదరాబాదీలు

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఉగ్ర కార్యకలాపాలు సాగించేందుకు ముస్లిం యువతను ఆకర్షించేందుకు సామాజిక మధ్యమాల ద్వారా కుట్ర పన్నారన్న కేసులోఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన 15 మందికి ఢిల్లీ కోర్టు వివిధ రకాల శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారున్నారు. ప్రధాన నేరస్థుడు నఫీస్‌ఖాన్‌కు పదేళ్లు, మరో ముగ్గురికి ఏడేళ్లు, ఇద్దరు ఆరేళ్లు, తొమ్మిది మందికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్‌సింగ్‌ తీర్పునిచ్చారు.

కాగా, దోషులందరికీ జరిమానా కూడా విధించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియాకు చెందిన ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా ముస్లిం యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించి 2015 డిసెంబర్‌9న కేసు నమోదు చేసింది. ఐఎస్‌ ఉగ్రవాదులు జునూద్‌-ఉల్‌-ఖలీఫా-ఫిల్‌-హింద్‌ పేరిట ఒక ఆన్లైన్‌ను గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులు తేలింది. ఉగ్రవాద సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో యువతను చేర్చుకోవడం ఇదే మొదటిసారి. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా జరిపిన సోదాలలో మొత్తం 19 మందిని అరెస్టు చేయగా,15 మంది నిందితులుగా తేలారు.

శిక్ష ఖరారైన వారిలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన నఫీస్‌ఖాన్‌, టోలీచౌకికి చెందిన మహ్మద్‌ షరీఫ్‌, మొయినుద్దీన్‌, సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఒబేదుల్లా ఉన్నారు. వీరిలో నఫీస్‌ఖాన్‌కు పదేళ్ల కఠినమైన జైలు శిక్షతోపాటు రూ.లక్షా 3వేల జరిమానా, మొయినుద్దీన్‌, ఒబేదుల్లాలకు ఒక్కొక్కరికి ఐదేళ్ల కఠినకారాగార శిక్ష తో పాటు రూ.38వేల చొప్పున జరిమానా విధించారు. ఇక మిగిలిన 12 మంది ముదాబ్బీర్‌, ముస్తాక్‌షేక్‌, అబుఅనస్‌, ముఫ్తి అబుస్‌సమీ, అజార్‌ఖాన్‌, అంజాద్‌ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, మహ్మద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ ముజాహిద్‌, ఎండీ ఆలీం, ఎండీ అప్జల్‌, సోహైల్‌ అహ్మద్‌, నజ్ముల్‌ హుడాకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు.

Next Story
Share it