విశాఖ కంటైనర్ కార్పొరేషన్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 11:42 AM GMT
విశాఖ కంటైనర్ కార్పొరేషన్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక విమానాశ్రయానికి సమీపంలో ఉన్న షీలానగర్ సిఎఫ్ఎస్ యార్డ్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దాంతో ఎల్లపువాని పాలెం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. యార్డులోని హానికర రసాయనాల ద్వారానే ఈ మంటలు వ్యాపించినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగనప్పటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన, సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదం, రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇలా వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విశాఖకు పరిపాలనా రాజధాని తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్న తరుణం వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story