ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం మబ్బులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 5:24 PM IST
ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం మబ్బులు..!

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపైనే చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగమనం కనిపించడం లేదు. వృద్ధి రేటు క్రమంగా దిగజారిపోతోంది. పారిశ్రామికరంగం ప్రతికూల ఫలితాలతో సతమతమ వుతోంది. ఆటో మొబైల్, తయారీ, ఉత్పత్తి, టెక్స్‌టైల్స్, బ్యాంకింగ్ తదితర కీలక రంగాలు తిరోగమనంలో పడిపోయాయి. అమ్మకాలు పడిపోవడంతో ఆటోమొ బైల్ రంగం అల్లాడిపోతోంది. ఉత్పత్తి-తయారీ నిలిచిపోతుండడంతో ఉద్యోగాలకు ఎసరు పడుతోంది.

ఇక..కీలకమైన వ్యవసాయ, సేవల రంగాలు కూడా ఆశించినం త మేర వృద్ధి చూపించడం లేదు. స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. ఒకరోజు పెరిగితే మరుసటి రోజు నష్టపోతోంది. ఎగుమతుల తగ్గి దిగు మతుల భారం పెరిగిపోతోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఒకరకమైన మందగమనం నెలకొంది. ఇది మున్ముందు చాలా కష్టాలకు దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నిర్మలమ్మకు మన్మోహన్ సుతిమెత్తని చివాట్లు

ఆర్థికమందగనంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అధికార, విపక్షాలు మాత్రం కీచులాడుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితి మీరు కారణమంటే మీరే కారణ మంటూ గొడవకు దిగుతున్నాయి. బ్యాంకుల పరిస్థితి దారుణంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ పేర్కొన్నారు. ఈ మంటల్లో నోబెల్ బహు మతి విజేత అభిషేక్ బెనర్జీ ఆజ్యం పోశారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాల ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. బ్యాంకుల దుస్థితికి రఘురామ్ రాజనే కారణమని ఆమె మండిపడ్డారు. యూపీఏ కాలం లోనే బ్యాంకుల నిరర్థక ఆస్థులు అమాంతం పెరిగిపోయాయని గుర్తు చేశారు. ఈ మాటలయుద్ధంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చేరారు. నిర్మలకు మన్మోహన్ సుతిమెత్తగా చివాట్లు పెట్టారు. ప్రతి దానికి ప్రతిపక్షాలను నిందించడం మాని అసలు పనిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ రగడ కొనసాగు తుండగానే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాల వసూళ్లను ప్రస్తావించిన కేంద్రమంత్రి, మందగమనం ఎక్కడ ఉందని వితండవాదం చేశారు. నెటిజన్లు, ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

70 ఏళ్లలో లేని ఆర్ధిక మందగమనం

మోదీ సర్కారు బహిరంగంగా అంగీకరించకపోయినా ఆర్థికవ్యవస్థలో మందగమనం వచ్చిందన్నది కాదనలేని వాస్తవం. నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ వ్యాఖ్యలే ఇం దుకు ఉదాహరణ. 70 ఏళ్ల స్వతంత్ర భారతం మునుపెన్నడూ ఇలాంటి ఆర్థికమందగమనాన్ని చూడలేదని ఆయన పేర్కొన్నారు. నిర్దిష్ట రంగాల్లో తక్షణమే చర్య లు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా పేరు తెచ్చు కుంది. 2017 నవంబరులో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారతదేశ రేటింగ్‌ను పెంచింది. మోదీ నేతృత్వంలో భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణలతో ముందుకు సాగుతోందని అభివర్ణించింది. రెండేళ్లకే అదే మూడీస్ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 3 సార్లు సవరించింది. 2019 నాటికి 7.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన మూడీస్, ఆ తర్వాత జీడీపీ రేటును 6.8 శాతానికి, అనంతరం 6.2శాతానికి సవరించింది. ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌లు కూడా దేశ వృద్ధి రేటును తగ్గించాయి. ఆర్బీఐ కూడా జీడీపీ రేటును తగ్గించింది.

ఐదేళ్ల క్రితమే సూచనలు కనిపించాయా..?

దేశ జీడీపీలో మూడింట రెండొంతులు ఉండాల్సిన వినియోగ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఫెడరల్ రిజర్వ్ మాజీ అధ్యక్షుడు అలన్ గ్రీన్‌స్పాన్ వినియోగానికి కొలమానంగా చెప్పే పురుషుల లోదుస్తుల విక్రయ వృద్ధి కూడా తిరోగమనంలోనే ఉంది. సుస్థిర అభివృద్ధికి పునాది లాంటి ప్రైవేటు రంగ పెట్టుబడులు పదిహేనే ళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. ప్రైవేటు రంగం నుంచి కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడులు దాదాపుగా లేవనే చెప్పాలి. నిజానికి, ఈ మందగనం కొత్తగా వచ్చింది కాదు. ఐదేళ్ల క్రితమే సూచనలు కనిపించాయి.

దెబ్బతీసిన ముడిచమురు ధరలు

అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉండడంతో గత అయిదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోయింది. చమురు ధరలు పెరగడంతో ప్రభావం మొదలైంది. నోట్ల రద్దు, జీఎస్టీ ఇబ్బందులు పరిస్థితిని మరింత దిగజార్చాయి. వ్యవసాయ, నిర్మాణ, ఉత్పత్తి రంగాలపై నోట్ల రద్దు పెను ప్రభావం చూపింది. దేశంలోని మూడొంతుల ఉద్యోగాలకు ఆధారమైన ఈ 3 రంగాలు దెబ్బతినడంతో అంతా తలకిందులైంది. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే 2017లో జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. ఈ పన్ను శ్లాబులను అర్థం చేసుకోలేక ఎందరో చిన్న వ్యాపారులు ఇబ్బందుల్లో పడ్డారు.. ఇక బడ్జెట్ ప్రతిపాదనలు పారిశ్రామిక రంగాన్ని మరింత దెబ్బతీశాయి. ఫలితంగా వ్యాపారాలు మూతపడి వృద్ధి రేటు దిగజారింది.

Next Story