ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేశారు.. ఎలా సాధ్యమైందంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 7:52 AM GMT
ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేశారు.. ఎలా సాధ్యమైందంటే?

Good News From Delhi కరోనాకు కళ్లాలు వేసే శక్తి లేక.. ఏం చేయాలో అర్థం కాక కిందామీదా పడుతున్న ప్రభుత్వాలు ఇప్పుడు చాలా కనిపిస్తున్నాయి. అందుకు భిన్నంగా.. కరోనాను ఎలా కంట్రోల్ చేయొచ్చో వినూత్న ప్రయోగాలతో.. సక్సెస్ అవుతున్నారు మరికొందరు. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది. ఆ మధ్యన కరోనా కేసులతో హడలిపోయిన హస్తిన.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఊపిరిపీల్చుకుంటోంది. ఇటీవల కాలంలో కరోనాను కంట్రోల్ చేయటంలో ఢిల్లీ ముందుంది.

దేశంలో కరోనాకు ఢిల్లీ రాజధానిగా మారుతుందని రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన వైనం అప్పట్లో పాలకుల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చేసింది. తర్వాతి కాలంలో పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకొని.. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయటం గమనార్హం. ఇంతకీ ఢిల్లీ అనుసరించిన ప్లాన్ ఏమిటి? ఏం చేసి కంట్రోల్ చేశారు? అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు వెంటనే అధ్యయనం చేసి.. ఆ ప్లానింగ్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఇంతకీ ఢిల్లీ విజయం వెనుక నాలుగు అంశాలు కీలకంగా మారినట్లుగా చెప్పాలి. పరీక్షలు.. రికవరీ.. కేంద్ర రాష్ట్రాల సమన్వయం.. ప్రజా సహకారం అనే నాలుగు అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని ఢిల్లీలో కొవిడ్ 19ను కంట్రోల్ లోకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలో కేసులు పూర్తిగా తగ్గిపోలేదుకానీ.. ఆందోళన స్థాయిలో మాత్రం లేదని చెప్పాలి. నెల రోజుల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం గమనార్హం.

మార్చి 2న ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. జూన్ 23 నాటికి అత్యధికంగా రోజులో 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారి తీవ్రమైన భయాందోళనలు మొదలయ్యాయి. కేంద్ర.. రాష్ట్రాలు కలిసి కట్టుగా చేసిన ప్రయత్నానికి నిదర్శనంగా తాజాగా రోజుకు 1200 - 1400మధ్య కేసులు నమోదు కావటంపై ఊపిరి పీల్చుకుంటున్నారు. పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు.

కేసుల్ని తగ్గించేందుకు వీలుగా తొలుత కొవిడ్ ను నిర్దారించే ఆర్ టీ పీసీఆర్ టెస్టుల కంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్ని మూడు రెట్లు ఎక్కువగా చేయటం మొదలు పెట్టారు. రోజుకు20వేల వరకు పరీక్షలు నిర్వహించటం గమనార్హం. ర్యాపిడ్ టెస్టుల ద్వారా 18 శాతం ఫాల్స్ నెగిటివ్ వచ్చినా.. వారికి మళ్లీ పరీక్షలు చేయటం ద్వారా.. కరోనా పాజిటివ్ ను త్వరగా గుర్తించటం షురూ చేశారు.

రోగుల్ని గుర్తించిన వెంటనే వారిని క్వారంటైన్ లో ఉంచేస్తూ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టటం ప్రారంభించారు. అంతేకాదు.. నగరాన్ని కంటైన్ మెంట్ జోన్.. మైక్రో కంటైన్ మెంట్ జోన్స్ గా విభజించారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట పర్యవేక్షణను పెంచారు. యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రుల్ని పెంచారు. ప్రజలకు ఆక్సో మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైరస్ సోకిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు నిఘాను పెద్ద ఎత్తున పెంచారు.

రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ప్లాస్మా థెరపీ ఇవ్వటం సత్ఫలితాల్ని ఇచ్చింది. ఈ థెరపీలో రికవరీ రేటు ఏకంగా 87 శాతం ఉండటం గమనార్హం. జాతీయ సగటు కంటే ఢిల్లీలో ఎక్కువగా ఉండటాన్ని మర్చిపోకూడదు. తాజాగా నిర్వహిస్తున్న రక్తపరీక్షల ద్వారా ఢిల్లీ వాసుల్లో సగటున 30 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లుగా తేల్చారు. వీరిలో ఎక్కువమందిలో వైరస్ ను తట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటి డెవలప్ అయ్యిందన్న విషయాన్ని గుర్తించారు. ఇదే.. కేసుల నమోదు తక్కువ కావటానికి కారణంగా భావిస్తున్నారు. ఏమైనా పక్కా ప్లానింగ్ తో చేపట్టిన ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story
Share it