టీమ్‌ఇండియా రిటైర్డ్ ఎలెవన్ vs కోహ్లీ సేన.. ఇర్పాన్ ఆలోచన
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 2:02 PM ISTగత దశాబ్ధ కాలంగా దిగ్గజ ఆటగాళ్లు చాలా మంది క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. విధ్వంసక ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ నుంచి మొదలుకొని ఇటీవల మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ వరకు చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో చాలా మంది సరైన వీడ్కోలు మ్యాచ్ ఆడలేదు. దీనిపట్ల కొందరు క్రికెటర్లు తమ సన్నిహితుల వద్ద వాపోగా.. యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు బహిరంగంగానే తమ మనోవేదనని వ్యక్తం చేశారు. అలాంటి ఆటగాళ్ల కోసం టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందు ఉంచాడు. దిగ్గజ ఆటగాళ్లకు ఘన వీడ్కోలు లభించలేదని బాధపడే బదులు రిటైర్డ్ ఎలెవన్, కోహ్లీ సేన మధ్య ఓ చారిటీ మ్యాచ్ నిర్వహిస్తే బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ధోని, సురేష్‌రైనాలు తమ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ధోనికి సరైన వీడ్కోలు లభించలేదని పలుపురు మాజీలతో పాటు, ధోని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ఆలోచనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన క్రీడాకారులందరికీ చివరగా ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందంటూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అందుకోసం రిటైరైన ఆటగాళ్లతో ఒక జట్టును కూడా రూపొందించారు.
పఠాన్ ప్రకటించిన జట్టు..
గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్లు కాగా.. మిడిలార్డర్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, ధోనీ ఉన్నారు. బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా ఉన్నారు. ఈ జట్టులో ఘన వీడ్కోలు అందుకున్న సచిన్, గంగూలీ మాత్రం చోటు దక్కలేదు.