నిజ‌నిర్థార‌ణ : ఏపీ రేషన్ కార్డులపైన 'యేసుక్రీస్తు' చిత్రం..? వార్త‌లో నిజ‌మెంత‌.?

By సత్య ప్రియ  Published on  9 Dec 2019 3:09 PM GMT
నిజ‌నిర్థార‌ణ : ఏపీ రేషన్ కార్డులపైన యేసుక్రీస్తు చిత్రం..? వార్త‌లో నిజ‌మెంత‌.?

ఏపీ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. జగన్ ప్రభుత్వం, మత మార్పిడుల కోసం దేనిని వదలడం లేదంటూ... ఆఖరికి పేదలకి ఇచ్చే రేషన్ కార్డు ను కూడా మత ప్రచారానికి వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక చిత్రం విస్తృతంగా ప్రచారంలో ఉంది. రేషన్ కార్డు పైన యేసు క్రీస్తు బొమ్మ వేసి ఉన్న చిత్రం ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాలలో షేర్ చేయబడుతోంది.

రేషన్ సరఫరా కార్డు, వడ్లమూరు అంటూ రాసి ఉన్న ఈ కార్డు పైన యేసు చిత్రం వేసి ఉంది.

కొందరు ఇది నిజమా కాదా అంటూ అడుగుతుంటే

మరికొందరు ఏపీ సీఎం జగన్ కొత్త రేషన్ కార్డుల మీద యేసు చిత్రం వేసి పంచుతున్నారంటూ షేర్ చేశారు.



కొన్ని వెబ్ సైట్లు అయితే "రేషన్ కార్డు పై ఉన్న చిత్రంలోని వారికే సరుకులు ఇవ్వబడును అని ఉంది, మరి రేషన్ కార్డు పైన యేసు చిత్రం ఉంది, అంటే ఆ మతానికి చెందిన వారికే రేషన్ లభిస్తుందా??" అంటూ రాశాయి.

https://www.telugubulletin.com/telugu/jesus-photo-on-ap-ration-card-26209

ఈ కార్డు తెలుగులో ఉంది. రేషన్ సరఫరా కార్డు, వడ్లమూరు అని పెద్దగా ఉంది. కార్డు హోల్డర్ పేరు, కార్డు నంబరు ఏమి రాసి లేదు, కానీ షాపు డీలర్ పేరు ఎం. మంగాదేవి, ఎం.సత్యసాయిరాం గా, షాపు నంబరు 34 అని ఉండడం చూడవచ్చు.

నిజ నిర్ధారణ:

రేషన్ కార్డు అనగా భారత ప్రభుత్వంచే లేదా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలచే భారతీయ హక్కు దారులు పొందిన రేషన్ కార్డు. ఈ కార్డును ప్రధానంగా రాయితీపై ఆహారపదార్థాలను మరియు ఇంధనాన్ని (గ్యాస్ మరియు కిరోసిన్) కోటా ప్రకారం పంచేందుకు ఉపయోగిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 39, 648 రేషన్ షాపులు ఉన్నాయి.

న్యూస్ మీటర్ బృందం ఏపి గవర్న్ మెంట్ రేషన్ షాపుల జాబితా లో తూర్పు గోదావరి జిల్లలోని రెషన్ షాపు నంబర్-34 వడ్లమూరు లో ఉన్నట్టు తెలుసుకుంది. షాపు డీలర్ పేరు ఎం. మంగాదేవి, ఎం. సత్యసాయిరాం అని నిర్ధారించుకుంది.

సాధారణంగా, రేషన్ కార్డు మీద రాష్ట్ర ప్రభుత్వ లోగో తో బాటు కుటుంబ పెద్ద వివరాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, ఇక్కడ చూపబడిన రేషన్ కార్డులో ఒక వైపు కార్డు హోల్డర్ వివరాలు, రేషన్ షాపు వివరాలు ఉన్నాయి, ఇంకో వైపు కుటుంబ చిత్రంతో పాటు, వారి పూర్తి వివరాలు కూడా నమోదు చేయబడి ఉన్నాయి.

వైరల్ అవుతున్న కార్డు అలా కాకుండా తెల్ల కాగితం మీద ప్రింటు చేయబడిందిగా ఉంది.

మీడియా కధనాల ప్రకారం, వైరల్ అవుతున్న కార్డు, రేషన్ కార్డుతో పాటు కార్డు హోల్డర్ ఏ సరుకులు తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు అనే జాబితా నమోదు చేసేందుకు ఉంచే పత్రంగా తెలింది.

రెషన్ షాపు డీలర్ స్వంతంగా ఈ పత్రాన్ని ప్రింట్ చేయించారని తెలుస్తోంది. ప్రతి ఏడాది ఒక్కో భగవంతుని చిత్రం ఈ పత్రం పైన వేయిస్తామని, పోయిన ఏడాది వేంకటేశ్వర స్వామి చిత్రం వేయించామని, ఈ సారి యేసు చిత్రం వేయించామని డీలర్ చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వం ప్రమేయం లేదని కూడా వారు చెప్తున్నారు.

అందుచేత, యేసు క్రీస్తు చిత్రం రేషన్ కార్డు పైన ఏపి ప్రభుత్వం వేయించలేదు. ఇది వడ్లమూరు అనే ప్రదేశంలో ఒక రేషన్ డీలర్ రేషన్ కార్డు తో పాటు వచ్చే రేషన్ సరఫరా కార్డు పైన వేయించిన చిత్రం.

ఏపీ సీఎం రేషన్ కార్డులపైన యేసు క్రీస్తు చిత్రం వేస్తున్నారనేది అబద్దం.

Claim Review:నిజ‌నిర్థార‌ణ : ఏపీ రేషన్ కార్డులపైన 'యేసుక్రీస్తు' చిత్రం..? వార్త‌లో నిజ‌మెంత‌.?
Claim Reviewed By:NewsMeter
Claim Fact Check:false
Next Story