15 ఏళ్లపాటు బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించి 'ఉక్కు మహిళ'గా పేరొందిన షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరుకోవడంతో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. గత మూడు వారాలుగా బంగ్లాదేశ్ లో హింస తారాస్థాయికి చేరుకోగా.. ఢాకా వీధులు ఆమె నిష్క్రమణతో సంబరాల్లో మునిగిపోయాయి.
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్, మిగిలిన రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత త్వరలో కొత్త మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 300 మందికి పైగా మరణించారని.. అల్లర్ల అణచివేతకు ముగింపు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థి నాయకులతో సమావేశం కానున్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం.. నిరసనకారులు సోమవారం గోనో భబన్ (పీఎం అధికారిక నివాసం)లోకి ప్రవేశించడం వంటి నివేదికల మధ్య, బంగ్లాదేశ్ ప్రజలు ప్రధానమంత్రి ఇంటిలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
"షేక్ హసీనా వాజిద్ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తున్న బంగ్లాదేశ్ ప్రజలు #Bangladesh #BangladeshProtests" అనే శీర్షికతో ఒక X వినియోగదారు ఈ వీడియోను షేర్ చేశారు.
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వీడియోను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఆ వీడియో శ్రీలంకకు చెందినది.. బంగ్లాదేశ్ కు సంబంధించింది కాదు.
వీడియోను విశ్లేషించిన తర్వాత, మేము BBC వాటర్‌మార్క్‌ను వీడియోలో చూశాము. అలాగే.. టెక్స్ట్ లో "శ్రీలంక సంక్షోభం - నిరసనకారులు అధ్యక్షుడు రాజపక్స నివాసంపై దాడి చేశారు." అని కూడా ఉందని గుర్తించాం.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూలై 9, 2022న ‘శ్రీలంక సంక్షోభం: నిరసనకారులు అధ్యక్షుని కొలనులో ఈత కొట్టారు’ అనే శీర్షికతో BBC నివేదిక మాకు కనిపించింది.
నివేదికలో అదే వైరల్ వీడియో ఉంది (అదే వ్యక్తి BBC వీడియోలో 00:16 సెకన్ల సమయం వద్ద.. వైరల్ వీడియోలో 00:23 సెకన్లకు పూల్‌లోకి డైవింగ్ చేయడం చూడవచ్చు).
వీడియో నివేదిక క్రింద ఉన్న టెక్స్ట్ లో “శ్రీలంక రాజధాని కొలంబోలో వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడి నివాసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కొలనులో ఈత కొడుతున్నట్లు చూపుతున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై నెలల తరబడి నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు."
తదుపరి కీవర్డ్ సెర్చ్ చేయగా జూలై 9, 2022న News18, ఇండియా టుడే వంటి ప్రధాన వార్తా సంస్థలు నివేదించిన కథనాల్లో అదే వీడియోను మేము గుర్తించాం.
బంగ్లాదేశ్‌లో నిరసనకారులు షేక్ హసీనా నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తున్నట్లు వీడియో చూపిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2022లో శ్రీలంక ప్రెసిడెంట్ రాజపక్సే స్విమ్మింగ్ పూల్ లో నిరసనకారులు ఈత కొడుతున్నారు.