FactCheck : వైరల్ అవుతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి డీప్ ఫేక్ వీడియో!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని CNBC-TV18 న్యూస్ యాంకర్ షెరీన్ భాన్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Feb 2024 9:30 PM ISTఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని CNBC-TV18 న్యూస్ యాంకర్ షెరీన్ భాన్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది. ట్రేడింగ్ యాప్ లో మూర్తి $3 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం గురించి యాంకర్ చెబుతూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ భారతీయులకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టిందని, చాలా మంది ఇప్పటికే ట్రేడింగ్ యాప్‌ని ఉపయోగించి తమ సంపదను పది రెట్లు పెంచుకున్నారని ఆమె వ్యాఖ్యలు చేసింది.
నారాయణ మూర్తి షెరీన్ భాన్ తో మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో చెప్పడం మనం వినొచ్చు. “నేను ఎలోన్ మస్క్‌తో కలిసి మా కొత్త ప్రాజెక్ట్‌ను మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాను. క్వాంటం AI అనేది తాము, ఎలోన్ బృందం 94 శాతం విజయవంతమైన రేటుతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్. క్వాంటం AI అనేది తక్కువ రిస్క్‌తో ట్రేడింగ్ స్టాక్‌ల నుండి లాభాలను ఆర్జించడానికి అనువైన సాధనం, అయితే మా లక్ష్యం క్వాంటం కంప్యూటింగ్ నుండి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. పేదరికం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రారంభించాలనుకుంటే, ప్రారంభ దశలో క్వాంటమ్ AIలో చేరడానికి ఇది సమయం. మీరు మొదటి రోజే ఏకంగా $3000 వరకు సంపాదించవచ్చు." అందులో చెబుతూ ఉండడం మనం గమనించవచ్చు.
“Unlock the power of AI with Narayana Murthy’s new platform! Read how the new platform can help you boost your savings,” అనే క్యాప్షన్ తో ఓ ఫేస్ బుక్ వినియోగదారుడు ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ వీడియో 'డీప్‌ఫేక్' అని కనుగొంది. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీడియోలోకి ఆడియోను ఉంచారు.
వీడియోలో మూర్తి CNBC-TV18 న్యూస్ యాంకర్ షెరీన్ భాన్‌తో సంభాషణలో ఉన్నట్లు మేము మొదట గుర్తించాము. ఈ సూచనను తీసుకొని, మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. జూలై 3న CNBC-TV18 ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్‌లో మూర్తి భాన్‌తో మాట్లాడుతున్న ఒక గంట వీడియోను చూశాము. మూర్తి సంభాషణ సమయంలో, స్టార్టప్ ఎకోసిస్టమ్, కార్పొరేట్ కల్చర్, ఫైనాన్షియల్ హెల్త్ మొదలైన వాటి గురించి మాట్లాడారు.
వీడియో ప్రారంభంలో వైరల్ క్లిప్ కనిపించింది. భాన్ సుదీర్ఘ పరిచయం తర్వాత, మూర్తి నేటి వ్యాపారవేత్తలను మెచ్చుకుంటూ మాట్లాడటం ప్రారంభించారు. అయితే, వైరల్ వీడియోలో ఉన్నట్లుగా అతను క్వాంటం AI ప్రాజెక్ట్‌ను ప్రకటించడం మేము గుర్తించలేదు.
వీడియోలో అదే బ్యాగ్రౌండ్ ను మనం చూడొచ్చు. ఆయన తన చెంపను తాకడం, వైరల్ వీడియోలో ఉన్నట్లుగా ఒక వ్యక్తి మొబైల్ నుండి రికార్డ్ చేయడం చూడవచ్చు. మూర్తి, భాన్ వేసుకున్న బట్టలు కూడా అవేనని మనం గుర్తించవచ్చు. రెండు వీడియోల నుండి ఒకే విధమైన విజువల్స్ ఇక్కడ మీరు కూడా చూడండి.
మా పరిశోధనలో, జూలై 7, 2023న మనీ కంట్రోల్ కాన్‌క్లేవ్ నుండి మూర్తి.. మరొక వీడియోలో ఎలోన్ మస్క్‌తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్న అదే డీప్‌ఫేక్ ఆడియోను మేము కనుగొన్నాము. మీడియా అవుట్‌లెట్ ఈ వీడియోను డిసెంబర్ 14, 2023న ప్రచురించింది. అసలు, ఎడిట్ చేసిన వీడియో మధ్య తేడాలను ఈ వీడియోలో వివరించారు. ఎలోన్ మస్క్‌తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అసలు వీడియోలో, అతను విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఎలా ఉండేవాడినో చెప్పడం వినవచ్చు.
మేము డిసెంబర్ 14, 2023 నుండి ఒక NDTV నివేదికను కూడా చూశాము. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించలేదని చెప్పారని పేర్కొంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న డీప్ ఫేక్ వీడియో మీద నారాయణ మూర్తి హెచ్చరికలు చేశారని అందులో తెలిపారు. ప్రజలు వీటిని నమ్మవద్దని, ఇలాంటి సంఘటనలపై సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.
నారాయణ మూర్తి డిసెంబర్ 14, 2023న Xలో కూడా తన గురించి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో నకిలీ వీడియోలు, పోస్ట్ లు ఉన్నాయంటూ హెచ్చరించారు.
In recent months, there have been several fake news items propagated via social media apps and on various webpages available on internet claiming that I have endorsed or invested in automated trading applications
— Narayana Murthy (@Infosys_nmurthy) December 14, 2023
అందువల్ల, ప్రజలు ట్రేడింగ్ స్టాక్‌ల నుండి లాభం పొందడం కోసం మస్క్‌తో కలిసి క్వాంటం AI ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడం గురించి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెబుతున్న వైరల్ వీడియో డీప్‌ఫేక్ అని మేము నిర్ధారించాము.
Credits : Sunanda Naik