పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. షేక్ షాజహాన్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. తృణమూల్ పార్టీ కార్యాలయంలో అతడు, అతని అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ.. అనేక మంది మహిళలు ముందుకు వచ్చారు. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించారని.. వారు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించారంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“పశ్చిమ బెంగాల్‌లో హిందూ మహిళల పరిస్థితి ఇది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళ అయి ఉండి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. అక్రమంగా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ప్రవేశించి పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేసారు,” అని ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో 2017లో జరిగినట్లు న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము మే 29, 2017న టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో వీడియోను కనుగొన్నాము. నివేదిక శీర్షికతో, 'UP రాంపూర్‌లో పట్టపగలు ఇద్దరు మహిళలను 14 మంది పురుషులు వేధించారు, వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు" అని ఉంది.
నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని తాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. ఇద్దరు మహిళలను పట్టుకుని వేధింపులకు పాల్పడిన 14 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 14 మంది అనుమానితుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు, ఐపీసీలోని సెక్షన్లు 354A (లైంగిక వేధింపులు), 354B (మహిళలపై దౌర్జన్యం చేయడం లేదా బలవంతంగా ఉపయోగించడం) కింద పోలీసులు నిందితులపై అభియోగాలు మోపారు. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్లు, ఎస్సీ/ఎస్టీ (నివారణ) అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
నలుగురు వ్యక్తులు షానవాజ్ ఖాద్రీ, సద్దాం ఖాన్, నవేద్ ఫర్హాన్‌లపై జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపామని.. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని ప్రజా శాంతిని దెబ్బతీసిందని కూడా మీడియా సంస్థలు తెలిపాయి.
మా దర్యాప్తులో.. 2022లో కూడా ఈ వీడియో వైరల్ అయిందని కనుగొన్నాము. యుపీ పోలీసు ఫ్యాక్ట్-చెక్ ఎక్స్ హ్యాండిల్, తప్పుదారి పట్టించే పోస్ట్‌కు స్పందించింది. ఈ సంఘటన 2017లో జరిగిందని వివరించారు. తాండా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.
మహిళలపై లైంగిక వేధింపులకు గురి అవుతున్న వీడియో పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకోలేదని.. యూపీకి చెందినదని మేము నిర్ధారించాము.
Credit : Md Mahfooz Alam