నీలం రంగు కుర్తీ వేసుకున్న మహిళ ఓ పోలీసు అధికారిని చెప్పుతో కొడుతున్న పోస్టు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుందని పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
"బరేలీ సివిల్ లైన్స్ న్యూస్ కథనం ప్రకారం.. పోలీసులు చలానా రాసినందుకు ముస్లింలు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది భారత్ లో ఏమి జరుగుతుందో తెలియజేస్తూ ఉంది. మన భవిష్యత్తు ఇలాగే ఉండనుంది. భారత్ లో ఇంటా, బయటా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉంది.
జర్నలిస్టు మధు కిశ్వార్ కూడా ఈ వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టు 2018 సంవత్సరంలో చోటు చేసుకున్నది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
ఈ వీడియోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియోకు సంబంధించి బరేలీ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇది ఇప్పుడు చేసుకుంది కాదని తెలిపారు. ఈ వీడియోను పరిశీలించగా రెండు సంవత్సరాల కిందటిదని తేలిందని.. ఘజియాబాద్ జిల్లాకు చెందినదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఘజియాబాద్ పోలీసు అధికారులు చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు.
గూగుల్ లో సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఈ ఘటనపై కథనాలను ప్రచురించాయి. 2018 ఆగష్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ లో ఓ మహిళ, కొందరు వ్యక్తులు కలిపి పోలీసుల మీద దాడి చేశారని.. TIMES OF INDIA, INDIA.COM, OUTLOOK INDIA మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశారు.
ఈ ఘటన బలరామ్ నగర్ లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద చోటు చేసుకుంది.
ఆధార్ కార్డులో కొన్ని తప్పులను సరిదిద్దుకోమని పోలీసు సూచించారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఇమ్రాన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి.. పోలీసుతో పాటూ, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా దాడి చేశారు. బ్యాంకుకు వచ్చిన ఇమ్రాన్ తో పాటూ.. ఇమ్రాన్ సోదరి కూడా పోలీసు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నదే అయినప్పటికీ.. బరేలీలో చోటు చేసుకుంది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఘజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.