కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఉంది. బీజేపీ దిగ్గజాలను పలు కార్యక్రమాల్లో భాగంగా కర్ణాటకకు వస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్రంలో పర్యటించారు. కాషాయ కండువాలు ధరించి, జెండాలు చేతపట్టుకుని కొంతమంది వ్యక్తులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిలో కొందరు ఎద్దుల బండిపై నిలబడి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా చూడవచ్చు.
#Karnatakaelection2023 అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ఒక ట్విటర్ వినియోగదారు వీడియోను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కర్ణాటకలో హిందువులు నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ బృందం వైరల్ వీడియో 2021 నాటిదని, మహారాష్ట్రలో శివసేన నిర్వహించిన నిరసనకు సంబంధించిన వీడియో ఇదని కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 5 ఫిబ్రవరి 2021న మరాఠీ డైలీ ప్రచురించిన కథనంలో ఇలాంటి చిత్రాన్ని మేము కనుగొన్నాము. ఎమ్మెల్యే సంతోష్ బంగర్ నేతృత్వంలో శివసేన విభాగం ఎద్దుల బండితో నిరసన కార్యక్రమం నిర్వహించిందని పేర్కొంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఒత్తిడి తీసుకుని వచ్చింది.
వేలాది మంది శివసైనికులు జెండాలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.
మేము 5 ఫిబ్రవరి 2021న YouTubeలో అప్‌లోడ్ చేసిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కూడా చూశాము. ఇంధన ధరలను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు.
పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారని 5 ఫిబ్రవరి 2021న ముంబై మిర్రర్ నివేదించింది.
ఈ వీడియో 2021 నాటిదని, కర్ణాటకలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.
- Credits : Md Mahfooz Alam