ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ

Uddhav Thackeray loses control over Thane civic body as 66 corporators join Shinde camp. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్

By Medi Samrat  Published on  7 July 2022 8:51 AM GMT
ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC)లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు ఏకనాథ్ షిండే శిబిరంలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం అర్థరాత్రి మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆయన నివాసంలో కలిసిన‌ట్లు తెలుస్తోంది. 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే థానే మున్సిపల్ కార్పొరేషన్ పై అధికారాన్ని కోల్పోయారు.

మ‌హ‌రాష్ట్ర‌లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన కార్పొరేషన్. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మహారాష్ట్రలోని మూడు పార్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం జూన్ 29న కూలిపోయింది.

థాకరే రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత 40 మంది తిరుగుబాటు శివ‌సేన ఎమ్మెల్యేలు, స్వతంత్రులు, బీజేపీ మద్దతుతో షిండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇప్ప‌ట్లో సమసిపోయేలా కనిపించ‌డం లేదు. ఉద్ధవ్ విధేయులు, షిండే వర్గం ఇద్దరూ తమ తమ గ్రూపుల‌తో అసలు శివసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. పార్టీ గుర్తు 'విల్లు, బాణం' పై గొడవ చేస్తున్నారు. తాజ‌గా 18 మంది శివసేన ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ సంచ‌ల‌న‌ ప్రకటన చేసిన నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో ఈ సంక్షోభం ఓ కొలిక్కి వ‌చ్చేలా లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.













Next Story