ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే.. ఎవరూ నన్ను అడ్డుకోలేరు..
Telangana Governor Mahila Darbar Programme. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్
By Medi Samrat Published on 10 Jun 2022 2:32 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో ప్రసంగించారు. మొదటగా మహిళా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ గవర్నర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్ ప్రజలను కలవగలరా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమేనని నొక్కిచెప్పారు. కరోనా సమయంలో వైద్యులు కూడా కరోనాతో ఇబ్బంది పడ్డప్పుడు.. నా సెక్యూరిటీ నన్ను వెళ్లవద్దని వారించినా.. నేను వెళ్లి ప్రజలను పరామర్శించాను.
ఇటీవల మహిళలు సమాజంలో ఎక్కువగా బాధింపబడుతున్న నేపథ్యంలో ఇక మహిళగా నా ఆవేదనను తెలియజేయాలనుకుంటున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వంతెనలా, వారధిగా ఉండాలనుకుంటున్నా.. దీనికి ఎదురుచెబుతున్న వాళ్లను నేను ఖండించబోను. నేను నిరసనకారుల గురించి ఆందోళన చెందటం లేదు. తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుంది. మహిళలు ఇబ్బందులకు గురైనపప్పుడు నేను చూస్తు ఉండలేను.. వాటిని తట్టుకోలేను.. వారిని ఆదుకోవడానికి నేను బలమైన శక్తిగా ఎప్పుడూ ఉంటాను. తెలంగాణలోని మహిళలు సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నేను తెలంగాణ మహిళలందరికీ ఒక సోదరిలా వారి వెనువెంటే ఉంటాను. ఎవరూ నన్ను అడ్డుకోలేరు. బలమైన స్వరంతో వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తాను. వాటిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. విధానం ఏదైనా కావచ్చు.. ప్రతిదీ ప్రజల కోసమే.. అందరి ప్రజల సంక్షేమం కోసమేనని తెలియజేస్తున్నాను. వినిపించలేని మహిళల గొంతు కూడా వినిపించబడాలి. నేను ఉత్ప్రేరకం మాత్రమే. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి భరోసా మహిళలకు చాలా అవసరం. మనం గెలుస్తాం.. మన గెలుపు ఎవరూ ఆపలేరని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.