తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో పులులు కనిపించాయనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. పులులు రోడ్డు మీద తీరికగా తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“Tigers Roaming in the village @Thudukurthi Village - NagarKurnool,” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. నగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిజ నిర్ధారణ:
కనీసం 2020 నుండి వీడియో ఇంటర్నెట్‌లో ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా.. 2020, 2021, 2023లో Facebook వినియోగదారులు పోస్ట్ చేసిన అదే క్లిప్‌ను మేము కనుగొన్నాము. 2020లో వీడియోను షేర్ చేసిన వినియోగదారు ఈ వీడియో గుజరాత్‌లోని గిర్ అటవీప్రాంతానికి చెందినదని క్యాప్షన్‌లో వివరించారు.
2023 లో షేర్ చేసిన పోస్ట్‌లో పచ్‌పేడ్వా-బంకత్వాలో పులులు సంచరిస్తున్నాయని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్ జిల్లాలోని పచ్‌పేడ్వా బ్లాక్‌లో బంకత్వా ఒక ప్రాంతం అని మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌లోని కామెంట్స్ విభాగంలో, ఈ పులులు ఉత్తరప్రదేశ్ కు సంబంధించినవి కావని.. గుజరాత్‌కు చెందినవని పలువురు సూచించారు.
తెలంగాణ అటవీ శాఖలో గతంలో పనిచేసిన PRO శ్రీకాంత్‌ను న్యూస్‌మీటర్ సంప్రదించింది. ఆ వీడియో గుజరాత్‌కు చెందినదని, అది తెలంగాణకు చెందినదన్న వాదన అవాస్తవమని ఆయన అన్నారు. మేము నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి (DFO)ని కూడా సంప్రదించాము. ఆయన నుండి స్పందన వచ్చినప్పుడు మేము మరిన్ని వివరాలను మీతో షేర్ చేసుకుంటాం.
న్యూస్‌మీటర్ వీడియోలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన స్థానాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. అయితే, ఈ వీడియో కనీసం 2020 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. అందువల్ల, ఈ వీడియో తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన కాదని స్పష్టంగా తెలుస్తోంది.