ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాలను మార్ఫింగ్ చేసినందుకు 'థర్డ్ డిగ్రీ' చిత్రహింసలు పెట్టారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హాకీ స్టిక్‌తో ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఫ్రేమ్‌లలో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఈ కొట్టడాన్ని గమనిస్తున్నట్లు ఉంది. బాధితుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్త అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ చిత్రాలను రూపొందించినందుకు పట్టుకున్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన టీడీపీ కార్యకర్తలను కుక్కను కొట్టినట్లు కొట్టారు అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని గుర్తించింది. ఐదేళ్ల క్రితం కర్ణాటకలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సెప్టెంబరు 13, 2019న ఇండియా టుడే, ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లోని యూట్యూబ్ ఛానెల్‌లలో అప్‌లోడ్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ETV ఆంధ్రప్రదేశ్ ద్వారా అప్‌లోడ్ చేసిన వీడియో టైటిల్ ‘“Eve Teasing | Suspect Subjected to Third-degree Torture | Inhuman Bengaluru cop under scrutiny.” అని ఉంది. దీన్ని బట్టి ఇదొక ఈవ్ టీజింగ్ ఘటనకు సంబంధించిన అంశం అని మేము గుర్తించాం.
దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, కళింగ టీవీ, ది ఏన్షియంట్ టీవీ, వార్తాభారతి వంటి స్థానిక మీడియా సంస్థలు సెప్టెంబర్ 12, 2019 నాటి నివేదికలలో ఉపయోగించిన అదే వీడియో, స్క్రీన్‌షాట్‌లను కనుగొన్నాము.
ఈ నివేదికల ప్రకారం, యశ్వంత్ అనే వ్యక్తిపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. బెంగుళూరులోని సుబ్రమణ్యనగర్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీకంఠే గౌడ నిందితుడు యశ్వంత్‌ను కొట్టించారని మీడియా నివేదికలు తెలిపారు. బెంగళూరులోని పార్కింగ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న 21 ఏళ్ల బాధిత మహిళ తన సహోద్యోగి అయిన యశ్వంత్ తో నిత్యం వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మే 10, 2019 న నమోదైంది. వీడియో ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ.. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసు కమిషనర్ భాస్కర్ రావు, సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీకంఠే గౌడను సస్పెండ్ చేస్తూ ఆదేశించారు.
ఈ వీడియోను బెంగుళూరు మిర్రర్, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ట్విట్టర్(X) లో షేర్ చేశాయి.
చివరగా, సెప్టెంబర్ 13, 2019న స్క్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ వంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా ఇదే సంఘటన గురించి నివేదించినట్లు కూడా మేము కనుగొన్నాము. టైమ్స్ నౌ నివేదిక ప్రకారం, పోలీసులు చర్యలు తీసుకున్న తర్వాత యశ్వంత్ తనను ఇబ్బంది పెట్టడం మానేశాడని బాధిత మహిళ తెలిపింది.
అందువల్ల, వైరల్ పోస్టుల్లోని వీడియో పాతది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తుంది.
Credits : Sunanda Naik