రోజంతా వేస్ట్ చేశారు: నారా లోకేష్
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు సీఐడీ ఎదుట విచారణకు
By Medi Samrat Published on 10 Oct 2023 2:38 PM GMTఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల తర్వాత విచారణ మొదలవగా, సాయంత్రానికి విచారణ ముగిసింది. అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను అక్టోబరు 10న విచారించారు. లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగారు. మరింత సమాచారం కోసం బుధవారం మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు నారా లోకేష్. తనను 50 ప్రశ్నలు అడిగినా.. అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రశ్న ఒక్కటి మాత్రమే ఉందన్నారు. మంత్రినయ్యాక భూముల లే అవుట్ పై ఇచ్చిన ఓ జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో మేం అవినీతికి పాల్పడ్డామని గానీ, మా కుటుంబం లబ్ది పొందిందని గానీ ఎలాంటి ఆధారాలను సీఐడీ వాళ్లు నా ముందు పెట్టలేదని లోకేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని దర్యాప్తు అధికారి నాతో చెప్పారు. రేపు నేను చాలా బిజీ.. ఆ ప్రశ్నలేవో ఇప్పుడే అడగండి.. ఎంత సమయం అయినా ఉంటాను అని బదులిచ్చాను. కానీ సీఐడీ అధికారులు అందుకు అంగీకరించలేదన్నారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ అక్కడిక్కడే నోటీసులు ఇచ్చారని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మేం చేసిన నేరమా.. అందుకే ఇలాంటి కేసుల్లో మమ్మల్ని పిలిచి ఇలా ఒక రోజంతా వేస్ట్ చేశారని లోకేశ్ విమర్శించారు.