FactCheck : ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారా..?

Media falsely reports Modi as the biggest contender for Noble Peace Prize. మార్చి 15న నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అతిపెద్ద పోటీదారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 March 2023 3:37 PM GMT
FactCheck : ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారా..?

Media falsely reports Modi as the biggest contender for Noble Peace Prize


మార్చి 15న నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అతిపెద్ద పోటీదారుగా నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి.

టోజే మార్చి 14న, న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (IIC)లో ఇండియా సెంటర్ ఫౌండేషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ చర్చకు హాజరయ్యారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ శాంతిపై ఆయన మాట్లాడారు.

అయితే నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ముందంజలో ఉన్నారని ఆయన చెప్పినట్లుగా కథనాలు ప్రసారం చేశారు. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ‘ప్రపంచ శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలు సరఫరా చేసి అండగా నిలిచారు. కీలక నిర్ణయాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈసారి నోబెల్ శాంతి బహుమతి.. మోదీని వరిస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

టైమ్స్ నౌ, ది ఎకనామిక్స్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, మింట్, ఎబిపి న్యూస్, సిఎన్‌బిసి టివి 18, బిజినెస్ స్టాండర్డ్, వియాన్, దైనిక్ జాగ్రన్, opindia, ఆసియానెట్ వంటి మీడియా సంస్థలు నోబుల్ శాంతి పురస్కారం దక్కబోతోందని కథనాలు ప్రసారం చేశాయి.

టైమ్స్ నౌ ఎడిటోరియల్ డైరెక్టర్, ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్, ఇండియా టుడే మేనేజింగ్ ఎడిటర్, యాంకర్ గౌరవ్ సావంత్ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కోట్ చేశారు.

నిజ నిర్ధారణ :

టోజే వ్యాఖ్యలని మీడియా సంస్థలు తప్పుగా పేర్కొన్నాయని న్యూస్‌మీటర్ కనుగొంది.

క్లెయిమ్‌ను నివేదించిన టైమ్స్ గ్రూప్‌లోని అన్ని ప్రచురణలను మేము తనిఖీ చేసాము. యూట్యూబ్‌లో ది ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన వీడియోలో, టైమ్స్ నౌ రిపోర్టర్, “ప్రపంచమంతా శాంతిని నెలకొల్పడంలో మా నాయకుడు మోదీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ?” అని టోజేని అడగడం వినవచ్చు.

టోజే స్పందిస్తూ, “నేను ప్రపంచమంతటా శాంతి ఉందని భావించడం లేదు. అయితే ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాని మోదీ సానుకూలంగా జోక్యం చేసుకుని అణ్వాయుధాలను ఉపయోగించకుండా రష్యాను హెచ్చరించడం నేను గమనించాను. అలా జరిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలోని ప్రతి దేశం ఇలాంటి సందేశాన్ని ఇవ్వాలని నేను భావిస్తున్నాను. భారతదేశం వంటి శక్తివంతమైన దేశం నుండి ఇలాంటి స్పందన రావడం చాలా ముఖ్యం" అని అన్నారు.

టోజే మాట్లాడుతూ.. “మోదీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద రాజనీతిజ్ఞులలో ఒకరు. భారతదేశం తక్కువ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచంలోని గొప్ప ఆర్థిక వ్యవస్థలో భారత్ఒకటి. భారతదేశం స్నేహపూర్వక స్వరంతో మాట్లాడుతుంది. ప్రపంచదేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. భారత్‌ ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థలలో ఎదుగుతోంది. ఏ దేశాన్ని ఒత్తిడి చేయకుండా, ఏ ఒక్కరినీ బెదిరించకుండా తమ స్నేహపూర్వక వైఖరితో సత్సంబంధాలను కొనసాగిస్తోంది.

టైమ్స్ నౌతో తన ఇంటరాక్షన్‌లో, నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారు అని టోజే చెప్పలేదు.

ది న్యూ ఇండియా, ABP న్యూస్‌తో టోజే వ్యాఖ్యలను కూడా మేము తనిఖీ చేసాము. మోదీ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోగలరా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "ప్రతి దేశంలోని ప్రతి నాయకుడు నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకోడానికి అవసరమైన పనిని చేస్తారని నేను ఆశిస్తున్నాను" అని అన్నారు. అంతే కానీ నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారు అని టోజే చెప్పడం మాకు కనిపించలేదు.

కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ టోజే వీడియోను ట్వీట్ చేస్తూ నోబెల్ శాంతి బహుమతికి మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదని, ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఆ వీడియోలో టోజే మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్ అన్నది ఎక్కువ అయ్యిందని.. దానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. ఈ వార్తలను తాను ఖండిస్తూ ఉన్నానని తెలిపారు.

రాహుల్ శివశంకర్ ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. "నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే పీఎం ప్రపంచ శాంతి స్థాపన ప్రయత్నాలను మెచ్చుకున్నారు కానీ నోబెల్ శాంతి బహుమతికి పోటీదారుగా ఆయనను ఆమోదించలేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఓ స్పష్టత వచ్చింది" అంటూ ట్వీట్ చేశారు.

నోబెల్ ప్రైజ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వ్యక్తుల పేర్లు వెల్లడించరు. నోబెల్ కమిటీ నామినీల పేర్లను బయటకు ప్రకటించకూడదనే ఆనవాయితీ కూడా ఉంది.

ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారనే కథనాలు అవాస్తవం.

- Credits : Md Mahfooz Alam



Claim Review:ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారా..?
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story