FactCheck : UPSC పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరిగిందా?
ఉత్తర భారతదేశంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల నిర్వహణ పరిస్థితిని చూపించే వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు
ఉత్తర భారతదేశంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల నిర్వహణ పరిస్థితిని చూపించే వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఒక పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్‌ను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఓ తరగతి గది నుండి మరొక తరగతికి వెళ్లి పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తున్నట్లు మనం చూడవచ్చు. విద్యార్థుల పక్కనే గైడ్‌లు, సమాధాన పత్రాలను చూడవచ్చు. మరొక వ్యక్తి ఆ వ్యక్తిని వీడియో రికార్డు చేయకుండా ఆపడంతో వీడియో ముగుస్తుంది.
ఈ వీడియోను Xలో షేర్ చేస్తూ, ఒక వినియోగదారు "UP, బీహార్, జార్ఖండ్‌లోని IAS పరీక్షా కేంద్రాలు! భవిష్యత్ భారత ప్రభుత్వాన్ని నడిపించే ఉత్తర భారతదేశానికి చెందిన IAS, IPS అధికారులను చూడండి" అనే శీర్షికతో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఈ వీడియోలోని సంఘటన 2024లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష సమయంలో చోటు చేసుకుంది కాదు. LLB పరీక్ష సమయంలో జరిగింది. వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మార్చి 1, 2024 నాటి ఇండియా టుడే నివేదికను మేము కనుగొన్నాము.
‘విద్యార్థులు మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు, ఈ UP పరీక్ష వీడియో వైరల్ అవుతుంది’ అనే శీర్షికతో ఉన్న నివేదికలో నిడివి ఎక్కువగా ఉన్న వీడియోను మనం చూడొచ్చు.
నివేదిక ప్రకారం, LLB పరీక్ష సమయంలో ఉపాధ్యాయుల సమక్షంలో ఈ మాస్ కాపీయింగ్ జరిగింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో రికార్డు చేశారు.
ఫిబ్రవరి 24, 2024న జీ న్యూస్ నివేదిక ప్రకారం, బారాబంకీలోని సిటీ లా కాలేజీలో జరిగిన ఎల్‌ఎల్‌బి పరీక్ష సమయంలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పేర్కొంది. దీన్ని రికార్డ్ చేసిన వ్యక్తి కూడా అదే కళాశాల పేరును చెప్పడం వినవచ్చు.
దైనిక్ భాస్కర్ కూడా ఈ సంఘటనపై ‘Cheating caught in Barabanki, exam cancelled: In LLB exam, a youth had shown mass cheating live on Facebook, college fined Rs 2 lakh.’ అనే శీర్షికతో నివేదించింది. ఈ ఘటన తర్వాత పరీక్షను క్యాన్సిల్ చేశారు. కాలేజీకి 2 లక్షల రూపాయల ఫైన్ విధించారు.
“ఫిబ్రవరి 27న బారాబంకిలోని సఫ్దర్‌గంజ్ ప్రాంతంలోని లక్ష్బర్ బాజాలో ఉన్న సిటీ లా కాలేజీలో జరిగిన పరీక్ష మొదటి షిఫ్ట్ సమయంలో జరుగుతున్న సామూహిక మోసాన్ని ఎల్‌ఎల్‌బి విద్యార్థి శివం సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రత్యక్ష ప్రసారం చేశాడు” అని నివేదిక పేర్కొంది.
ఎల్‌ఎల్‌బి పరీక్షలు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్నాయి. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చినందుకు సిటీ లా కాలేజీకి రూ. 2 లక్షల జరిమానా విధించారు.
భారతదేశంలో, సివిల్ సర్వీసులలో ప్రవేశ పరీక్షలైన IAS, IPS, IFS లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహిస్తుంది. వార్తల నివేదికల ప్రకారం, ఇది UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించినది కాదు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదని న్యూస్‌మీటర్ తేల్చింది.
Credits : K Sherly Sharon