పశ్చిమ బెంగాల్‌లో, ముఖ్యంగా ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో, 2025 వక్ఫ్ (సవరణ) చట్టం ఆమోదించిన తర్వాత చెలరేగిన హింస మధ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఈ ఫుటేజ్‌లో సైనిక దుస్తుల్లో ఉన్న సిబ్బంది అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసి ఇళ్లపై దాడి చేస్తున్నట్లు చూడొచ్చు. నిర్బంధించిన వారు ముస్లింలని పోస్టులు పెడుతున్నారు.
ఒక X యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "భారత సైనికులు పశ్చిమ బెంగాల్‌లో దారుణాలకు పాల్పడిన ఇస్లామిక్ ఆక్రమణదారులను వేటాడి అరెస్టు చేస్తున్నారు. ఈసారి వారిని వదిలిపెట్టకూడదు" అని పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో ఇటీవలిది కాదని, బంగ్లాదేశ్ కు సంబంధించినదని మేము గుర్తించాం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
బెంగాలీ నంబర్ ప్లేట్, బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా సంస్థ, బంగ్లావిజన్ న్యూస్ లోగోతో ఉన్న వాహనాన్ని మేము గమనించాము. భారతదేశంలోని వాహనాలపై ప్రాంతీయ భాషల్లో నంబర్ ప్లేట్లు అనుమతించరు.
వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అది అక్టోబర్ 29, 2024న బంగ్లాదేశ్‌లోని మొహమ్మద్‌పూర్‌లో జరిగిన భారీ ఆర్మీ ఆపరేషన్‌ను నివేదిస్తూ బంగ్లా విజన్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారని తేలింది.
బంగ్లాదేశ్ వార్తాపత్రిక ది బిజినెస్ స్టాండర్డ్ అక్టోబర్ 29, 2024న ఈ ఆపరేషన్ గురించి నివేదించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. ఆ నివేదికలో వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి.
నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన 23వ తూర్పు బెంగాల్ రెజిమెంట్‌కు చెందిన డేరింగ్ టైగర్స్ యూనిట్ ఢాకాలోని మొహమ్మద్‌పూర్‌లోని జెనీవా క్యాంప్‌పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రెండు విదేశీ రివాల్వర్లతో పాటు అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ముఠా నాయకుడు బునియా సోహెల్ దాక్కున్నాడని అందిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు.
మరో మీడియా సంస్థ కల్బెలా కూడా అక్టోబర్ 28, 2024న, 23వ తూర్పు బెంగాల్ రెజిమెంట్‌కు చెందిన తొమ్మిది బృందాలతో కూడిన బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన డేరింగ్ టైగర్స్ యూనిట్ ఢాకాలోని మొహమ్మద్‌పూర్ ప్రాంతంలోని జెనీవా క్యాంప్‌పై దాడి చేసిందని నివేదించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారు బునియా సోహెల్‌ను పట్టుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యం. సోహెల్ తప్పించుకున్నప్పటికీ, అతని ఏడుగురు సహచరులను అదుపులోకి తీసుకున్నారని కథనాలు తెలిపారు. ఈ దాడిలో అధికారులు అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కాబట్టి, వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్ కు సంబంధించిందనే వాదన అబద్ధమని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam