ముంబై లోని విక్రోలీలో ఓ పెట్రోల్ బంకుకు సంబంధించిన బిల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ బిల్లులో "If you want to reduce the petrol price don't vote for Modi again." అంటూ ఆఖర్లో మెసేజీ ఉండడాన్ని గమనించవచ్చు. పెట్రోల్ ధరలు తగ్గాలి అంటే మోదీ(భారత ప్రధాని నరేంద్ర మోదీ) కి ఓటు వేయకండి అని అందులో ఉంది.
ఇటీవలి కాలంలో భారత్ లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక ఈ పోస్టును కూడా పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఎటువంటి నిజం లేదు. ఈ బిల్లును పూర్తిగా ఎడిట్ చేశారు. ముంబై లోని విక్రోలీలో పెట్రోల్ బంకు అనేదే లేదని తెలుస్తోంది.
ఈ వైరల్ ఇమేజ్ లో బాలాజీ పెట్రోలియం అన్నది HPL డీలర్ అని ఉంది. భారతదేశంలో అలాంటి పెట్రోలియం కంపెనీ అన్నదే లేదు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను HPCL అని పిలుస్తారు కానీ HPL అని పిలవరు. ముంబై లోని విక్రోలీ ప్రాంతంలో శ్రీ బాలాజీ పెట్రోలియం అనే పేరుతో ఎటువంటి ఫ్యూయల్ స్టేషన్ కూడా లేదని తేలింది.
2018 సమయంలో కూడా ఇలాంటి ఫోటోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఆ ప్రాంతంలో లేదని తేల్చేసింది.
ఫిబ్రవరి 23, 2021న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరో ట్వీట్ ను చేసింది. వైరల్ అవుతున్న బిల్లు తమ డీలర్ ఇచ్చింది కాదని తేల్చారు. కంపెనీ పేరులో ఉన్న తప్పిదాన్ని కూడా గుర్తించాలని కోరారు.
కాబట్టి.. పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండాలంటే మోదీకి ఓటు వేయకండి అంటూ బంకుల్లో ఇచ్చే బిల్లుల్లో ఉండే నోట్ లో వస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.