నిజమెంత: యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ మీద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారా?

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొందరిపై బుల్డోజర్ యాక్షన్ కు దిగిన సంగతి తెలిసిందే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2024 8:00 AM GMT
NewsMeterFactCheck, Yogi Adityanath, campaign, bulldozer, BJP, Maharashtra, Harish Pimple

నిజమెంత: యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ మీద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారా?

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొందరిపై బుల్డోజర్ యాక్షన్ కు దిగిన సంగతి తెలిసిందే. అక్రమ ఆస్తులు, ఆక్రమణలపై కొన్ని ప్రాంతాల్లో ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం దూకుడుగా పలు చర్యలు తీసుకుంది. అందులో బుల్డోజర్ యాక్షన్ ఒకటి. ఆయన్ను సోషల్ మీడియాలో 'బుల్డోజర్ బాబా' అంటూ పిలుస్తూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇద్దరు వ్యక్తులు జేసీబీ లోడర్‌లో నిల్చుని కనిపిస్తూ ఉన్నారు. వారిలో ఒకరు బీజేపీ కండువా ధరించగా, మరొకరు కాషాయ రంగు బట్టలు ధరించి ఉన్నారు. యోగి సాధారణంగా ధరించే బట్టలను ఆ వ్యక్తులు ధరించి ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నట్టు ఉన్న ఆ వీడియో ప్రచారంలో ఉంది.

ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి, "బుల్డోజర్ ఆయన గుర్తింపుకు దాదాపు పర్యాయపదంగా మారింది. ప్రజల నమ్మకానికి అనుగుణంగా జీవించడం యోగి జీ ముఖ్య లక్షణం" అని వ్రాశారు. (ఆర్కైవ్)

తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసే రైట్ వింగ్ అకౌంట్ Baba Banaras లో ఈ వీడియోను చూసాం. “యోగి జీ స్వాగ్" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త, యోగి ఆదిత్యనాథ్ కాదు. బీజేపీ కండువా కప్పుకున్న వ్యక్తి మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ పింపుల్.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, నవంబర్ 6న ABP Majha ఈ వీడియోని ప్రచురించినట్లు కనుగొన్నాము. మహారాష్ట్ర లోని అకోలాలో ప్రచారం కోసం ఒక BJP అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ డూప్ ను తీసుకువచ్చారని ఛానెల్ పేర్కొంది.

మరింత ధృవీకరణ కోసం, న్యూస్‌మీటర్ హరీష్ పింపుల్‌తో మాట్లాడింది. అకోలా జిల్లాలోని ముర్తిజాపూర్‌లో యోగి ఆదిత్యనాథ్ ర్యాలీ తర్వాత బుల్డోజర్ ర్యాలీ జరిగిందని, బుల్డోజర్ లోడర్‌పై నిలబడిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ కాదని స్పష్టం చేశారు.

"కాషాయ దుస్తులు ధరించి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న బీజేపీ కార్యకర్తతో పాటు లోడర్ మీద నిలబడి ఉన్నాను" అని ఆయన వివరించారు. ఆ బీజేపీ కార్యకర్త పేరు తనకు తెలియదని అన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ నివేదికల ప్రకారం, UP ముఖ్యమంత్రి నవంబర్ 6న వాషిం, అమరావతి, అకోలాలో మహాయుతి (NDA కూటమి) అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బుల్‌డోజర్ ర్యాలీకి యోగి నాయకత్వం వహించినట్లు ఏ నివేదిక కూడా మాకు కనిపించలేదు.

నవంబర్ 6న అకోలాలోని ముర్తిజాపూర్‌లో యోగి ర్యాలీ నుండి వచ్చిన చిత్రాలను కూడా హరీష్ పింపుల్ Xలో పోస్టు చేశారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Md Mahfooz Alam

Claim Review:https://www.youtube.com/watch?v=NBT6CAeA7Gw
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story