తమిళనాడులో ఖాతా తెరుస్తామని భారీ ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఈసారీ నిరాశ తప్పలేదు. కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రెండో స్థానంలో సరిపెట్టుకున్నారు. తమిళనాడులో మొత్తం 39 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసింది. ఎలాగైనా అక్కడ తాము ఖాతా తెరుస్తామని భారీగా నమ్మకం పెట్టుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు.
తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన కారణంగా అన్నామలై మానసికంగా క్రుంగిపోయారు అనే వాదనలతో సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
'జై శ్రీరామ్', 'భారత్ మాతా కీ జై' అంటూ ఓ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఉద్వేగానికి లోనవుతున్నట్లు చూపించే 32 సెకన్ల వీడియో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఒక X వినియోగదారు వీడియోని షేర్ చేస్తూ, “డియర్ @అన్నామలై_కే జీ, దృఢంగా ఉండండి. అన్నీ చేసినా ఎన్నికల్లో ఓడిపోవడం.. దాన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు. కానీ మీ అంకితభావం చూపించిన తెగువను అందరూ గుర్తిస్తారని నమ్ముతున్నాను! (sic)” అంటూ పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)
ఇలాంటి వీడియో ఇక్కడ చూడవచ్చు. ( ఆర్కైవ్ )
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
తమిళనాడులో ఓటింగ్ రోజు కంటే ముందే ఈ కార్యక్రమం జరిగిందని.. అందుకే ఆ వాదన తప్పు అని న్యూస్ మీటర్ కనుగొంది.
ఏప్రిల్ 17, 2024న తమిళ వార్తా సంస్థ పుతియా తలైమురై టీవీ ప్రచురించిన వీడియోని కూడా మేము చూశాం. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు వీడియోలను గుర్తించాం. ఈ వీడియోలు అన్నీ ఎన్నికల ఫలితాలకు చాలా రోజుల ముందే సోషల్ మీడియాలో ఉండడాన్ని మేము గమనించాం. ‘Annamalai spoke on the stage with tears in his eyes.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఒరిజినల్ వీడియోలో 14:39 నుండి 15:04 నిమిషాల వరకు, 16:40 నుండి 16:50 నిమిషాల వరకు వైరల్ క్లిప్ కనిపించింది.
అదనంగా, దినమలర్ ఈ సంఘటనను ‘Disturbed Annamalai on the stage: Meltdown on the last day of campaigning,’ అనే శీర్షికతో నివేదించింది, ఇది ఓటింగ్‌కు ముందు జరిగిన వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది. కోయంబత్తూరులోని కస్తూరి నాయకన్ పాళయంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నట్లు వార్తాకథనం పేర్కొంది.
ఏప్రిల్ 17న ప్రచారం ముగియగా.. తమిళనాడులో ఏప్రిల్ 19న పోలింగ్‌కు వెళ్లారు. ఈ వీడియో ఏప్రిల్ 17న అప్లోడ్ చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైరల్ వీడియోలో అన్నామలై ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టలేదు.
తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన తర్వాత అన్నామలై కన్నీళ్లు పెట్టుకున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. తన ప్రచారంలో భాగంగా వృద్ధులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Credits: Sibahathulla Sakib