నిజమెంత: వైరల్ అవుతున్న వీడియోలో తగలబడుతున్నది హోటల్.. ఆలయం కాదు
"బంగ్లాదేశ్ లోని ఇస్లాంవాదులు మరో హిందూ దేవాలయానికి నిప్పంటించారు.. అంటూ పోస్టు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2024 5:50 AM GMTనిజమెంత: వైరల్ అవుతున్న వీడియోలో తగలబడుతున్నది హోటల్.. ఆలయం కాదు
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఆ దేశ టెలివిజన్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారని, మిలటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య, హసీనా దేశం విడిచి పారిపోయి, భారతదేశంలోనే ఉంటున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే ఆమె UK కు వెళతారనే ప్రచారం కూడా సాగుతోంది.
హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని.. పలువురిని టార్గెట్ చేస్తున్నారని మీడియా కథనాలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస చెలరేగిందని ఆరోపిస్తూ.. అనేక ఆధారాలను భారతీయ ట్విట్టర్ హ్యాండిల్స్ పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, గోపురం లాంటి నిర్మాణం ఉన్న బిల్డింగ్ మంటల్లో ఉండడాన్ని చూపించే వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన నిరసనకారులు హిందూ దేవాలయాన్ని తగులబెట్టారని ఆరోపించారు.
ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి.. "బంగ్లాదేశ్ లోని ఇస్లాంవాదులు మరో హిందూ దేవాలయానికి నిప్పంటించారు..." (ఆర్కైవ్) అంటూ పోస్టు పెట్టారు.
మరొక X వినియోగదారుడు.. “బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలలో 61 జిల్లాలలో, హిందువుల జనాభా సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ మీడియా 27 జిల్లాల్లో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని, హిందూ సంఘాలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై భారత్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. భారత్ వెంటనే జోక్యం చేసుకోవాలి." అంటూ పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. మంటల్లో చిక్కుకున్న భవనం ఓ హోటల్, హిందూ దేవాలయం కాదు.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. బంగ్లాదేశ్‌లోని ప్రముఖ జాతీయ దినపత్రిక కల్బెలా ఆగస్టు 5న ప్రచురించిన నివేదికలో స్క్రీన్‌గ్రాబ్‌ను మేము కనుగొన్నాము. హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోతోందన్న వార్తల నేపథ్యంలో సత్ఖిరా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం జరిగిందని నివేదించింది. పోలీసు స్టేషన్లు, జైళ్లు, రాజకీయ నేతల ఇళ్లతో సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని ప్రస్తావించారు. అయితే, సత్ఖిరాలోని ఆలయంపై దాడి గురించి ప్రస్తావించలేదు.
ఏడు నెలల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన అనేక వీడియోలలో కూడా మేము అదే భవనాన్ని కనుగొన్నాము. మొదటి వీడియోకు ‘Raj Prasad Restaurant Kalaroa, Satkhira.’ అనే టైటిల్ ఉండగా.. రెండో వీడియో టైటిల్ A 100 crores palace has been constructed in Kalaroa, Satkhira district.’ అని ఉంది. ఈ టైటిల్స్ ను బట్టి అది ఒక రెస్టారెంట్.. ప్రైవేట్ ప్రాపర్టీ అని తెలుస్తోంది.
మేము భవనం ప్రవేశ ద్వారం చూపే YouTube వీడియో నుండి కీఫ్రేమ్‌ను సంగ్రహించాము. AI సాధనాలు ChatGpt, గూగుల్ జెమినిని ఉపయోగించి.. మేము ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గుర్తుపై ఉన్న పేర్లను తెలుసుకోవాలని ప్రయత్నించాం. హోటల్‌కు నిజంగా ‘రాజ్ ప్రసాద్’ అని పేరు పెట్టినట్లు కనుగొన్నాము.
కీవర్డ్ సెర్చ్ ద్వారా, మేము జనవరి 3, 2024న అప్లోడ్ చేసిన అదే భవనానికి సంబంధించిన YouTube వీడియోను కనుగొన్నాము. 4:21 నిమిషాల వీడియోలో ఒక వ్యక్తి భవనం ముందు భాగం నుండి హోటల్ ఇండోర్, అవుట్‌డోర్ టూర్ చేస్తున్నట్లు చూపబడింది.
వీడియో శీర్షిక ప్రకారం.. భవనం సత్ఖిరా జిల్లాలోని కలారోవాలోని రాజ్ ప్రసాద్ కాఫీ షాప్ & రెస్టారెంట్ అని తెలుసుకున్నాం.
మేము Google మ్యాప్స్‌ని ఉపయోగించి నిర్మాణాన్ని కూడా భౌగోళికంగా గుర్తించాము. ఫిబ్రవరి 2023లో కెమెరాలో బంధించిన నిర్మాణంలో ఉన్న అదే భవనం ఇక్కడ ఉంది. కామెంట్ల విభాగంలో హోటల్ అందించే ఆహారం, సేవల నాణ్యత గురించి చాలా మంది వ్యక్తులు మాట్లాడారు.
అందువల్ల, వైరల్ వీడియోలో ఉన్నది హోటల్ మాత్రమే. హిందూ దేవాలయం కాదు.