నిజమెంత: హై లెవెల్ సమావేశం నుండి భారత ఆర్మీ అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారా?

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై బలమైన దౌత్య, సైనిక, దేశీయ చర్యలను ప్రారంభించింది. నేరస్థులకు మద్దతు ఇచ్చినందుకు పాకిస్థాన్ మీద భారత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 April 2025 1:30 PM IST

NewsMeterFactCheck, Pahalgam, Army, india, Pakistan

నిజమెంత: హై లెవెల్ సమావేశం నుండి భారత ఆర్మీ అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారా?  

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై బలమైన దౌత్య, సైనిక, దేశీయ చర్యలను ప్రారంభించింది. నేరస్థులకు మద్దతు ఇచ్చినందుకు పాకిస్థాన్ మీద భారత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇక బలమైన వార్నింగ్ ఇవ్వడానికి భారత్ సైనిక చర్యలు తీసుకునే అవకాశం గురించి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరుగుతున్నాయి.

ఈ సందర్భంలో, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఒక వీడియోలో సైనిక అధికారులు సమావేశం నుండి మధ్యలోనే వాకౌట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడు వైఖరి ఉన్నప్పటికీ, సీనియర్ ఆర్మీ జనరల్స్ ఉన్నత స్థాయి సమావేశం నుండి నిష్క్రమించి, పాకిస్తాన్‌తో సైనిక వివాదంలో పాల్గొనలేమని తమ అసమర్థతను వ్యక్తం చేశారని వైరల్ పోస్టులు షేర్ చేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.

అధికారులు బయటకు వెళ్తుండగా ఒక వ్యక్తి వారిని ప్రశ్నిస్తూ, “సైన్యం దేనికి భయపడుతోంది? వారు ఇలా ఎందుకు పారిపోతున్నారు? ఎంత అవమానకరం!” అని అంటున్నట్లు వీడియోలో ఉంది.

"బ్రేకింగ్: పాకిస్తాన్‌పై యుద్ధంలో పాల్గొనలేమని తమ అసమర్థతను వ్యక్తం చేస్తూ, భారత ఆర్మీ సీనియర్ జనరల్స్ ఉన్నత స్థాయి సమావేశం నుండి వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ దూకుడు వైఖరితో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భారత సైన్యంలోని కొన్ని అంశాలను ప్రతిబింబిస్తాయి. ఈ సంఘటన వారి సంసిద్ధతకు సంబంధించిన నిజమైన స్థితిని వెల్లడిస్తుంది" అని సోషల్ మీడియా యూజర్లు వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్)

పాక్-బంగ్లా కనెక్ట్ అనే X ఖాతా, “#PahalgamTerrorAttack #Pahalgam #FalseFlagOperation” అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి వీడియోను షేర్ చేసింది. “మీరు దేనికి భయపడుతున్నారు? సైన్యం దేనికి భయపడుతోంది? మీరు ఎందుకు ఇలా పారిపోతున్నారు? @adgpi జనరల్స్ సూటిగా అడిగిన ప్రశ్నల నుండి పారిపోయారు!!!” అని రాసుకొచ్చారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియో పాతది, ప్రస్తుత ఘటనలకు ఎలాంటి సంబంధం లేనిది. కాబట్టి న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాము. మార్చి 25న రక్షణ జాతీయ భద్రతా వ్యవహారాలను కవర్ చేసే జర్నలిస్ట్ అమన్ సింగ్ చినా Xలో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు కనుగొన్నాము.

ఆ పోస్ట్‌లో, అమన్ సింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడటానికి సైన్యం విముఖత చూపడాన్ని ప్రశ్నించారు. వెస్ట్రన్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మోహిత్ వాధ్వా, ఇతర సీనియర్ అధికారులు పాటియాలా కల్నల్ ఓ కేసుపై ప్రకటన చదివిన తర్వాత ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వెళ్లిపోయారని హైలైట్ చేశారు. DGP కూడా ఒక వివరణ చదివి వెళ్లిపోయారు. ఇటీవలి రోజుల్లో కనీసం మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని విమర్శించారు.

మరో యూజర్ అడిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రశ్నకు అమన్ సింగ్ స్పందిస్తూ, సైన్యంపై విమర్శలు చేసారు. ప్రెస్ మీట్ ఏకపక్షంగా జరిగిందని అన్నారు.

ఈ వార్తల ఆధారంగా, పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, సైన్యంతో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను మార్చి 25న పంజాబ్ ప్రభుత్వ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీడియోలోని 3:27 నిమిషాలకు, అధికారులు కాన్ఫరెన్స్ ముగించినప్పుడు వైరల్ క్లిప్‌లోని అదే ప్రశ్నలు వినవచ్చు.

ఇంతకూ పాటియాలా కల్నల్ కేసు అంటే?

మార్చి 25న NDTV నివేదిక ప్రకారం, మార్చి 13-14 రాత్రి పాటియాలాలో పార్కింగ్ వివాదంపై 12 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది తనపై, తన కుమారుడిపై దాడి చేశారని కల్నల్ పుష్పిందర్ సింగ్ బాత్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. దర్యాప్తును CBI లేదా మరొక స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ కల్నల్ బాత్ పంజాబ్- హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏప్రిల్ 12న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన ప్రకారం, పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాన్ని అనుసరించి, ఈ కేసును దర్యాప్తు చేసి నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయడానికి SIT ఏర్పడింది.

కాబట్టి, వీడియో పాతదని, పాకిస్తాన్‌పై సైనిక చర్యపై ఆర్మీ జనరల్స్ సమావేశం నుండి వాకౌట్ చేశారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.

Credit: Mahfooz Alam

Claim Review:పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత హై లెవెల్ సమావేశం నుండి భారత ఆర్మీ అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:NewsMeter
Claim Fact Check:False
Next Story