నిజమెంత: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై పాకిస్థాన్ జెండాలతో ఊరేగింపు నిర్వహించారా?

హైదరాబాద్‌లో పచ్చజెండాలు చేతబట్టుకుని ఊరేగింపు చేస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెబుతూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 April 2024 12:18 PM IST
NewsMeterFactCheck, Milad-Un-Nabi, Hyderabad, Congress

నిజమెంత: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై పాకిస్థాన్ జెండాలతో ఊరేగింపు నిర్వహించారా? 

హైదరాబాద్‌లో పచ్చజెండాలు చేతబట్టుకుని ఊరేగింపు చేస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెబుతూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేసి.. పాకిస్థాన్ మద్దతుదారులు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైకి వచ్చారని చెప్పుకొచ్చారు. “ బీజేపీకి పాకిస్తాన్ శత్రు దేశం.. మాకు కాదు అని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు అన్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్‌లో: పాకిస్తాన్ మద్దతుదారులు జెండాలు ఊపుతున్నారు. ఇవి ఏ దేశ జెండాలు ??? పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తెలివిగా ఓటు వేయండి” అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

“Karnataka Congress leader said: Pakistan enemy country for BJP; not for us Slogans of Pakistan Zindabad were raised. And now in Hyderabad: Pakistan supporters wave flags What flags are these ??? Vote wisely; VOTE VERY WISELY.” అన్నది ట్వీట్. (ఆర్కైవ్)

ఈ వీడియోను బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ బీఎల్ శ్రీనివాస్ సోలంకీ కూడా పోస్ట్ చేశారు. ఏప్రిల్ 8 నాటి ఆసియానెట్ న్యూస్‌బుల్ (ఆర్కైవ్) నివేదిక ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కలిగే పరిణామాలను పేర్కొంటూ సోలంకీ వీడియోను పంచుకున్నారు. ఆయన వీడియోకు “పాకిస్తానీ మద్దతుదారులు జెండాలు ఎగురవేయడంతో హైదరాబాద్‌లో అశాంతి నెలకొంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు." అంటూ పోస్టు పెట్టారు. "హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్, కాంగ్రెస్ పాలనలో ఇలా ఉంది" అని సోలంకీ పోస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత సోలంకీ పోస్ట్‌ను తొలగించారు. ఆర్కైవ్ పోస్ట్

నిజ నిర్ధారణ:

ఈ వీడియో ఇటీవలిది కాదు. అంతేకాకుండా తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఊరేగింపుకు సంబంధించింది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.

ఈ పోస్ట్‌కు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక హ్యాండిల్ (ఆర్కైవ్) ప్రతిస్పందించింది. వీడియో 2023లో చిత్రీకరించారని.. మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుకు సంబంధించిందని తెలిపారు. ఈ పోస్ట్‌ను తొలగించవలసిందిగా వినియోగదారుని కోరారు.. తప్పుడు సమాచారాన్ని పంచుకోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఆ వీడియోను మేము యూట్యూబ్‌లో కనుగొన్నాము. హైదరాబాద్ డెక్కన్ న్యూస్ (ఆర్కైవ్) ఛానెల్ 2 అక్టోబర్ 2023న వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ ఛానెల్ ప్రకారం.. యువత మిలాద్ సందర్భంగా బైక్ పై ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమం కారణంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.

భారతదేశంలో గత ఏడాది సెప్టెంబర్ 28న మిలాద్-ఉన్-నబీని జరుపుకున్నారు. డిసెంబర్ 7, 2023న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అందుకే ఆ వీడియో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఊరేగింపు వీడియో కాదని స్పష్టమైంది.

వీడియోలో కనిపించే జెండాల గురించి ఏమిటి?

వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు.. ఊరేగింపులో ఆకుపచ్చ జెండాలు మాత్రమే కాకుండా ఇతర మతపరమైన జెండాలు కూడా ఉన్నాయని మేము గమనించాము. మేము ఆకుపచ్చ మత జెండాను పాకిస్తాన్ జాతీయ జెండాతో పోల్చాము. పాకిస్తాన్ జెండాకు తెల్లటి స్ట్రిప్.. ఎదురుగా నెలవంక, నక్షత్రం ఉంటుంది. అయితే వైరల్ వీడియోలోని జెండాకు తెల్లటి స్ట్రిప్ లేదు. కాబట్టి, అది మతపరమైన జెండా తప్ప.. పాకిస్థాన్ జెండా కాదు.

అందుకే, ఈ ఊరేగింపును చూపించే వీడియో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకోలేదు. ఆ వీడియోలో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదని మేము నిర్ధారించాము. వీడియో గత సంవత్సరం మిలాద్-ఉన్-నబీకి సంబంధించినది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credits: Md Mahfooz Alam

Claim Review:హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై పాకిస్థాన్ జెండాలతో ఊరేగింపు నిర్వహించారా?
Claimed By:X and Instagram users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Instagram
Claim Fact Check:False
Next Story