Fact Check: తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2024 6:45 AM GMTతప్పుడు దావా చేసిన పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నిరసిస్తూ తెలంగాణకు చెందిన ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోను షేర్ చేస్తున్న యూజర్లు కూడా మీడియాలో ఈ ఘటనను నివేదించడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహిళలకు ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడం తమ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని వాదిస్తూ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు.
"తెలంగాణలో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి బాధ్యులెవరు...?" వీడియోను అప్లోడ్ చేసిన ఓ X వినియోగదారుడు ప్రశ్నించాడు.
(గమనిక: విజువల్స్ పలువురిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న కారణంగా మేము వీడియోకి ఎలాంటి లింక్‌లను ఉపయోగించడం లేదు.)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ తెలిపింది. ఈ వీడియో తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించింది.
ఒక X వినియోగదారు వైరల్ పోస్టుకు సంబంధించిన కామెంట్స్ లో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌కి చెందినదని సూచించినట్లు మేము కనుగొన్నాము. ఈ సూచనను తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. డిసెంబర్ 28, 2023న V6 న్యూస్ రిపోర్ట్‌లో ప్రచురించిన ఓ కథనంలో వీడియో నుండి స్క్రీన్‌గ్రాబ్‌ను కనుగొన్నాము. చనిపోయిన వ్యక్తిని శ్రీకాళశాస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బియ్యపు వ్యక్తిగత సహాయకుడు రవిగా నివేదిక గుర్తించాం. ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు.
తెలుగు వన్ కథనం ప్రకారం.. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిఏ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొనలేదని నివేదిక పేర్కొంది.
తెలుగుపోస్ట్ కథనం ప్రకారం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పీఏ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పీఏ రవి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. రవి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డులో రవి నివాసముంటున్నారు. ఎమ్మెల్యే పీఏగా ఉంటూ రవి నాలుగున్నరేళ్లుగా తిరుమల దర్శన టిక్కెట్ల వ్యవహారాలను నడిపించేవారు. కుటుంబ వ్యవహారాల కారణంగానే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
సమయం తెలుగు కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఇంటి దగ్గర ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే తరఫున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవారు.
అందువల్ల, వైరల్ వీడియోలో తెలంగాణలోని ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదని మేము నిర్ధారించాము. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించినది.
Credits : Md Mahfooz Alam