Fact Check : దిశ రవి సింగిల్ మదర్ అంటూ వైరల్ అవుతూ ఉన్న పోస్టులు..!

climate activist Disha Ravi is not a single mother. క్లైమేట్ యాక్టివిస్ట్ దిశ రవి అరెస్టుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on  17 Feb 2021 1:20 PM IST
fact check news of Disha Ravi is a single mother
క్లైమేట్ యాక్టివిస్ట్ దిశ రవి అరెస్టుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. 21 సంవత్సరాల దిశ రవి అరెస్టుపై సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. ఢిల్లీ పోలీసులు దిశా రవిని అరెస్ట్ చేశారు. గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశా రవి, ముంబై లాయర్ నిఖితా జాకబ్, ఇంజనీర్ శంతనుల అరెస్టులు కూడా జరిగాయి.


భారత రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల పరేడ్ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ టూల్ కిట్ డాక్యుమెంట్ ను అంతర్జాతీయ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ టూల్ కిట్ లో పేర్కొన్న అంశాలు ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి ఊతమిచ్చేలా ఉన్నాయని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తేలా ఈ టూల్ కిట్ ను ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారులు తయారు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బెంగళూరు అమ్మాయి దిశా రవి, ముంబయికి చెందిన నికితా జాకబ్, శంతనులే టూల్ కిట్ సృష్టికర్తలని పోలీసులు వెల్లడించారు. వీరు ఖలిస్తాన్ అనుకూల పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీఎఫ్ జే)తో కలిసి టూల్ కిట్ కు రూపకల్పన చేశారని, ఆ తర్వాత దాన్ని గ్రెటా థన్ బర్గ్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపించారని ఢిల్లీ పోలీసులు వివరించారు.



21 సంవత్సరాల దిశా రవి 'సింగిల్ మదర్' అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వస్తున్నారు. టైమ్స్ నౌ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 14 ఫిబ్రవరి 2021న టైమ్స్ నౌలో కథనం వచ్చింది. అందులో దిశా రవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ "Our daughter, a single mother, an avid animal lover and sole earning member of the family was whisked away forcefully by members of Delhi Police, said climate activist Disha Ravi's family."అంటూ చెప్పుకొచ్చారని కథనాలు ఉన్నాయి. తమ కుమార్తె సింగిల్ మదర్ అని.. జంతు ప్రేమికురాలు అని.. తనే కుటుంబాన్ని పోషిస్తోందని చెప్పుకొచ్చారని ఈ కథనంలో ఉంది.



ఈ కథనం తర్వాత పలువురు సామాజిక మాధ్యమాల్లో దిశ రవి సింగిల్ మదర్ అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.






నిజ నిర్ధారణ:

దిశా రవి 'సింగిల్ మదర్' అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

టైమ్స్ నౌ మొదట దిశా రవి 'సింగిల్ మదర్' అంటూ పెట్టిన వ్యాఖ్యలను ఆ తర్వాత డిలీట్ చేశారు. దిశా రవి తన తల్లితో కలిసి బెంగళూరు లోని చిక్కబన్నావరలో ఉంటున్నారు. గత అయిదు సంవత్సరాలుగా అలానే ఉన్నారు. దిశా రవి తండ్రి మైసూరులో అథ్లెటిక్స్ కోచ్ గా ఉన్నారు. అందుకే దిశా తన తల్లితో కలిసి బెంగళూరులో ఉంటోంది.

ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం దిశా తన తల్లితో కలిసి బెంగళూరులో ఉంటోందని స్థానికులు తెలిపారని చెప్పారు. దిశా పర్యావరణ వేత్త మాత్రమే కాకుండా ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే సంస్థకు ఫౌండర్ లో ఒకరు. శుక్రవారం పూట ఈ సంస్థతో కలిసి పర్యావరణం కోసం చేయాల్సిన.. చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడమే కాకుండా.. నాయకులు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉంటారు.

బెంగళూరు లోని మౌంట్ కేరమెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ ను పూర్తీ చేసింది దిశా. బ్రిటీష్ వోగ్ మ్యాగజైన్ లో కూడా ఆమె గురించిన ప్రస్తావన వచ్చింది. పలు వార్తా సంస్థల్లో ఆమె పర్యావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ ను కూడా రాస్తూ వస్తుంటారు.

https://www.freepressjournal.in/india/who-is-disha-ravi-all-you-need-to-know-about-the-21-year-old-climate-change-activist-held-in-greta-thunberg-toolkit-case

దిశా రవి 'సింగిల్ మదర్' అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Claim Review:దిశ రవి సింగిల్ మదర్ అంటూ వైరల్ అవుతూ ఉన్న పోస్టులు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story