హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పలు పార్టీల నేతలు సవాళ్ల మీద సవాళ్లు చేస్తూ వస్తున్నారు. ఎన్నో వివాదాలు కూడా నడుస్తూ ఉన్నాయి. వరద సహాయం పంపిణీ ఆపాలని కేంద్రానికి బండి సంజయ్ లేఖ రాశారంటూ ఫేక్ లెటర్ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది. హిందీలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా రాజా సింగ్ వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది.
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ తాను అనుకున్నది చేస్తూ వస్తున్నారు. నగరంలోని చాలా మంది పార్టీ నేతలు బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతడి తీరు కారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ బతకాలి అంటే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించాల్సి ఉంటుంది. జై హింద్.. జై బీజేపీ..' అన్నది వైరల్ అవుతున్న పోస్టు. పలువురు ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న ట్వీట్ లో ఉన్న సమాచారాన్ని, ఆ ట్వీట్ ను తప్పుబట్టారు రాజా సింగ్. తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదని ఇదొక మార్ఫింగ్ చేసిన పోస్టు అని తేల్చి చెప్పారు. తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. కొందరు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తూ ఉన్నారని.. నా పేరును ఎడిట్ చేసి ఈ ట్వీట్ చేసినట్లుగా తెలిపారు. తాను ఈ వైరల్ ట్వీట్ పై సైబర్ క్రైమ్ అధికారులను కలుస్తానని అన్నారు. తన పేరు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజా సింగ్.
పలు సామాజిక మాధ్యమాల్లో కూడా రాజా సింగ్ ఈ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశాయి. అలాగే తెలుగు మీడియా సంస్థలు కూడా రాజా సింగ్ చుట్టూ ఫేక్ న్యూస్ తిరుగుతూ ఉన్నాయని కథనాలను ప్రసారం చేశాయి.
రాజా సింగ్ బండి సంజయ్ కు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అది ఒక మార్ఫింగ్ చేసిన ఫేక్ ట్వీట్.