మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమైన సంగతి తెలిసిందే..! దీంతో ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఓ వైపు వదంతులను వ్యాప్తి చేస్తూ ఉన్నారు. మరో వైపు కరోనా కేసులు ఎక్కువగా అవుతూ ఉండడంతో మహారాష్ట్రలోని అమరావతిలో వారం రోజుల పాటూ లాక్ డౌన్ ను అమలు చేశారు. ఫిబ్రవరి 22న లాక్ డౌన్ ను అమలు చేశారు.
రోడ్ల మీద బైకులపై తిరుగుతూ ఉన్న వారిని కొట్టడం మొదలు పెట్టారు పోలీసులు అంటూ ఓ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో కొత్త లాక్ డౌన్ మొదలైంది. అలాగే రోడ్డు మీదకు వచ్చిన వాళ్ళను పోలీసులు కూడా వదలడం లేదు అంటూ.. వీడియోను పోస్టు చేస్తున్నారు. అందులో చుట్టుపక్కల షాపులు అన్నీ మూసి వేసి ఉండగా.. బైక్ ల మీద వెళుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకుని కొట్టడాన్ని గమనించవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియో ఇప్పటిది కాదని మార్చి 2020కి చెందినదని తేలింది. ఇప్పటి లాక్ డౌన్ కు సంబంధించిన వీడియో కాదని స్పష్టంగా అర్థం అవుతూ ఉంది.
ఈ వీడియోను గతంలో పలు మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ లోనూ అప్లోడ్ చేశారు. 'Nation Next', 'Mahasanvad Media' వంటి మీడియా సంస్థలు 2020 సంవత్సరంలోనే ఈ వీడియోను అప్లోడ్ చేశాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని విదర్భ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కారణాలను బట్టి.. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటి లాక్ డౌన్ కు సంబంధించిన వీడియో కాదు. 2020 సంవత్సరం మార్చి నెలలో చోటు చేసుకున్న ఘటనలను తాజాగా మహారాష్ట్రలో అమలు చేస్తున్న లాక్ డౌన్ తో ముడిపెట్టి వీడియోలను పోస్టు చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న వీడియోకు.. ఇప్పటి లాక్ డౌన్ కు ఎటువంటి సంబంధం లేదు.