నిజమెంత: ప్రధాని మోదీ రాకతో ఆ ప్రాంతమంతా మోదీ నామస్మరణతో దద్ధరిల్లిన వీడియో పంజాబ్ కు చెందినదా?
దేశంలోని అనేక ప్రాంతాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. ప్రస్తుతం పంజాబ్ మీద అందరి దృష్టి ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2024 9:54 AM ISTనిజమెంత: ప్రధాని మోదీ రాకతో ఆ ప్రాంతమంతా మోదీ నామస్మరణతో దద్ధరిల్లిన వీడియో పంజాబ్ కు చెందినదా?
దేశంలోని అనేక ప్రాంతాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. ప్రస్తుతం పంజాబ్ మీద అందరి దృష్టి ఉంది. జూన్ 1న రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాలకు చివరి దశ పోలింగ్ జరగనుండగా.. కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు భారీగా ప్రతిధ్వనిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని జలంధర్‌లోని ఓ మైదానంలో ప్రధాని మోదీ ర్యాలీకి సంబంధించిన వీడియో ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఒక X వినియోగదారు వీడియోను పంజాబీలో ఇదొక అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. వినియోగదారు తన బయోలో ‘Voice of Punjabi Hindus’ అని ఉంది.
నిజ నిర్ధారణ:
ఈ వీడియోకు పంజాబ్ లోని జలంధర్ కు ఎలాంటి సంబంధం లేదు.
పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారానికి సంబంధించినది కాదు. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మోదీ ర్యాలీకి సంబంధించిన వీడియో ఇదని న్యూస్‌మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించినప్పుడు.. ఏప్రిల్ 3, 2019న బీజేపీ (Archive), PM MODI (Archive) అధికారిక X హ్యాండిల్స్ పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. కోల్‌కతాలో ప్రధాని మోదీ ర్యాలీకి సంబంధించిన వీడియో ఇదని క్యాప్షన్ పేర్కొంది.
Electrifying atmosphere at PM Shri @narendramodi's public meeting in Kolkata. #DeshKeLiyeModi pic.twitter.com/m7Xwc7R1bS
— BJP (@BJP4India) April 3, 2019
వైరల్ క్లిప్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లు.. ఒరిజినల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ లు మీరు చూడొచ్చు. ఒకేలాంటి విజువల్స్‌ను చూడొచ్చు.
ఏప్రిల్ 3, 2019న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మెగా ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించినట్లు అనేక వార్తా నివేదికలు కూడా మేము కనుగొన్నాము. NDTV, ఇండియా టుడే ప్రకారం.. ఈ కార్యక్రమంలో, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాయుధ బలగాలను అణగదొక్కడం, జాతీయ భద్రతను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఈ రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
అంతేకాకుండా, మే 24, 2024న జలంధర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారని మేము ధృవీకరించాము. వార్తా సంస్థ PTI (archive) షేర్ చేసిన ర్యాలీకి సంబంధించిన వీడియో క్లిప్‌లలో ఆయన కాషాయ రంగు తలపాగా ధరించినట్లుగా ఉన్నాయి. తదనంతరం, ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగించిన 28 నిమిషాల వీడియోను మేము కనుగొన్నాము.. అదే తేదీన ఆయన అధికారిక ఛానెల్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. PTI క్లిప్‌లు, పొడిగించిన వీడియో రెండింటిలోనూ, మోదీ కాషాయ రంగు తలపాగా ధరించి కనిపించారు. అయితే, వైరల్ క్లిప్‌లో ఆయన కాషాయ రంగు తలపాగా ధరించినట్లు కనిపించలేదు.
అందుకే, వైరల్ క్లిప్ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 2019లో జరిగిన మోదీ ర్యాలీకి సంబంధించిన వీడియో అని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.