నిజమెంత: ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారా?
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏడు దశలకు ఐదు దశల్లో పోలింగ్ ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2024 9:30 PM IST
నిజమెంత: ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారా?
నిజమెంత: ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారా?2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏడు దశలకు ఐదు దశల్లో పోలింగ్ ముగిసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన పాత్ర పోషించినందుకు ప్రశంసించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో మారుతున్న రాజకీయ భావాలకు ప్రతిస్పందనగా మోహన్ భగవత్ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారని వీడియోను షేర్ చేస్తున్న అకౌంట్ల ద్వారా చెబుతున్నారు.
“మన దేశంలోని ప్రజలకు రాజకీయ అవగాహన పరిమితం. రాజకీయ అవగాహన తప్పకుండా ఉండాలి. ఎందుకంటే పౌరులు అధికారం, దాని ప్రాముఖ్యతను గుర్తించాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక గొప్ప ఉద్యమం అభివృద్ధి చెందింది, ఈ రోజు మనకు స్ఫూర్తినిచ్చే ప్రముఖ వ్యక్తులను తీసుకుని వచ్చింది. ఆ ఉద్యమం సామాన్య ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా ప్రేరేపించింది. స్వాతంత్ర్యం సాధించడంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంది, ” అని భగవత్ వీడియోలో చెప్పారు.
ట్విట్టర్ లో (Archive) ఒక ప్రీమియం యూజర్ “ఓ మై గాడ్సే. మోహన్ భగవత్ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీని, దాని వ్యవస్థాపక సభ్యులను ఎందుకు ప్రశంసించారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్పులే కారణమా…” అంటూ పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
2018లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లోని వీడియో ఇది.. వైరల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ క్లిప్‌లో.. మేము హిందూస్థాన్ టైమ్స్ లోగోను, సెప్టెంబరు 17, 2018 తేదీని ఎడమ ఎగువ మూలలో ఉన్నట్లు గమనించాము. దీన్ని క్లూగా ఉపయోగించి, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. ఆ మీడియా సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లో సెప్టెంబరు 18, 2018న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. వీడియో టైటిల్ ప్రకారం.. భారత స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ ముఖ్యమైన పాత్ర పోషించింది, మోహన్ భగవత్ చెప్పారని ఉంది.
మీడియా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 18, 2018న, దేశ రాజధానిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేతృత్వంలో మూడు రోజుల లెక్చర్ సిరీస్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భగవత్ తన ప్రసంగంలో, స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన ముఖ్యమైన పాత్రను గుర్తించి, భారతదేశానికి ఎందరో మహానుభావులను తయారు చేసిందని వివరించారు.
NDTV లో కూడా మోహన్ భగవత్ స్టేట్మెంట్ గురించి రిపోర్ట్ చేశారు. “Mohan Bhagwat Opens RSS Outreach Event With Rare Praise For Congress.” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. సెప్టెంబర్ 18, 2018న వీడియోను ప్రచురించారు.
మోహన్ భగవత్ ఢిల్లీలో మూడు రోజుల కాన్క్లేవ్ లో భాగంగా ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిందని తన స్పీచ్ లో భాగంగా చెప్పుకొచ్చారు.
2018లో భగవత్ చేసిన ఈ అరుదైన ప్రకటనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించాయి.
ఈ వీడియో దాదాపు ఏడేళ్ల నాటిదని మేము నిర్ధారించాము. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కాంగ్రెస్ పార్టీని పొగడడం ప్రారంభించారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.