అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టగానే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే 30 ఆదేశాలపై సంతకాలు చేశారు. కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడటంమేకాకుండా.. ట్రంప్ విధానాలను రద్దు చేస్తున్నారు. 30 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల్లో.. బెర్లిన్ సరిహద్దు గోడ నిర్మాణం కోసం నిధులను నిలిపివేయాలని ఆదేశించారు. ముస్లిం దేశాలపై ఉన్న ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడం.. మాస్క్ తప్పనిసరి లాంటి ఆదేశాలు ఉన్నాయి. ట్రంప్ రూపొందించిన సుమారు పది విధానాలను రివర్స్ చేస్తూ బైడెన్ ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ పరిక్షణ కోసం పారిస్ ఒప్పందంలో చేరడం, తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందించడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి.
ఇక ఇలాంటి సమయంలో ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అమెరికాలోని క్యాపిటల్ హిల్ భవనం ముందు శుక్రవారం నాడు నమాజ్ చేస్తూ ఉన్నారు. బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఇలా నమాజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
"Joe Biden's new America in front of Capitol Hill on Friday." అంటూ పలువురు పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ఫోటో 2009 సంవత్సరానికి చెందినది.. అంతేకాకుండా ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి ఈ పోస్టును పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టును గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 2019 లోనూ "Islam in America" అంటూ పోస్టు చేశారు. 2017 లోనూ మరోసారి Boston 25 News రిపోర్టులో కూడా అప్లోడ్ చేశారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదు 2009 సంవత్సరానిది. సెప్టెంబర్ 25, 2009న ఈ ఫోటోను తీశారు.
ఈ ఫోటోను అలెక్స్ వాంగ్ తీశారు. స్టాక్ ఇమేజ్ సైట్ అయిన Getty వెబ్సైట్ లో ఈ ఫోటోను చూడొచ్చు.
CNN రిపోర్టుల ప్రకారం ఈ ఫోటోను 2009లో తీశారు. "Islam on Capitol Hill 2009" అనే ఈవెంట్ పేరిట అమెరికన్ ముస్లింలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. న్యూజెర్సీ లోని దార్ ఉల్ ఇస్లాం మసీదు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. పెద్ద ఎత్తున ముస్లింలు హాజరయ్యారు. అమెరికా లోని ముస్లింలు మాత్రమే కాకుండా బ్రిటన్, కెనెడాకు చెందిన ముస్లింలు కూడా హాజరయ్యారు.
వైరల్ అవుతున్న ఫోటో 2009 నుండి ఇంటర్నెట్ లో లభిస్తోంది. జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక ముస్లింలు శుక్రవారం నమాజు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.