నిజ నిర్ధారణ(Fact Check): తెలంగాణాలో స్కూళ్ల పున:ప్రారంభం అక్టోబర్ 31 కి వాయిదా?
By సత్య ప్రియ Published on 18 Oct 2019 10:24 AM GMTదసరా సెలవుల తరువాత తెలంగాణలోని విద్యా సంస్థలు అక్టోఅబర్ 14న పున: ప్రారంభం కావల్సి ఉండింది. అయితే, ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. బస్సులు లేని కారణంగా విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త సుమారు అన్ని వార్తా మాధ్యమాలలో ప్రసారం అయ్యింది.
రెండు రోజుల క్రితం టివి 9 లో ప్రసారం అయ్యిందంటూ ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేసింది. తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మరిన్ని రోజులు సెలవులు ప్రకటించిందని ఉన్న టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ చిత్రాలని ఈ ప్రచారంలో వాడుకున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ తెలుగు ఈ చిత్రాలు నిజమైనవా కాదా అని నిర్ధారించ ప్రయత్నించింది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ ఉపయోగించి నిజ నిర్ధారణ చేసింది. వెలికితీయగా, అక్టోబర్ 17న ముద్రించిన కొన్ని ప్రచురణలు కనిపించాయి.
ఈ చిత్రాలు టివి9 కి సంబంధించినవి కావనీ, ఎవరో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ టివి9 యాజమాన్యం స్పష్టం చేసింది. కొందరు తమ పేరుతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను ఈ నెల 19 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న తెలంగాణలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కొందరు మరోసారి తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగించిన ప్రచారం మొదలుపెట్టారు.
స్కూళ్లు ప్రారంభించే తేదీ దగ్గరకు వచ్చేస్తున్నా ఇంకా ఆర్టీసి సమ్మె విరమించలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో తెలియని అయోమయ స్థితిలో జనం ఉన్నారు. దీనిని అలుసుగా తీసుకొని కొందరు ఇంతకు ముందు ప్రసారం అయిన బ్రేకింగ్ న్యూస్ ప్లేట్లను తీసుకొని మార్ఫింగ్ చేసి వాటిని తప్పుడు ప్రచారాలకు వాడుతున్నారు.
నిజం ఏంటంటే, ఆర్టీసి ఉద్యోగుల సమ్మె ఇంకా కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ల ప్రారంభం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
దావా: తెలంగాణాలో స్కూళ్ల పున:ప్రారంభం అక్టోబర్ 31 కి వాయిదా
దావా చేసినవారు: సోషల్ మీడియా మాధ్యమాలు
నిజ నిర్ధారణ: అబద్దం. టివి9 బ్రేకింగ్ ప్లేట్లని వాడుకొని అబద్దపు ప్రచారం జరుగుతోంది