యుక్త వయసులో ఆస్టియో అర్థరైటీస్‌.. తెలుసుకోవాల్సిన అంశాలు

Everything one needs to know about Osteoarthritis at a young age. ఆర్థరైటీస్‌లో అత్యంత సహజంగా కనిపించేది ఆస్టియో ఆర్థరైటీస్‌.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2022 5:30 PM IST
యుక్త వయసులో ఆస్టియో అర్థరైటీస్‌.. తెలుసుకోవాల్సిన అంశాలు

ఆర్థరైటీస్‌లో అత్యంత సహజంగా కనిపించేది ఆస్టియో ఆర్థరైటీస్‌. ఎముకల కీళ్ల వద్ద ఉండే మృదులాస్తి క్షీణించడం వల్ల ఇది వస్తుంది. ఈ మృదులాస్తి క్షీణించడం వల్ల ఎముకలు ఒకదానికొకటి ఒరిపిడికి గురై నొప్పి, కదలికలలో ఇబ్బంది, గట్టిపడటం వంటి సమస్యలెదురవుతాయి.

సాధారణంగా ఈ ఆస్టియో ఆర్థరైటీస్‌ వృద్ధాప్యంలో అధికంగా కనిపించినప్పటికీ ఇటీవలి కాలంలో 25–40 సంవత్సరాల వయసు వ్యక్తులలోనూ కనిపిస్తుంది. ఆస్టియో అర్థరైటీస్‌ సాధారణంగా చేతులు, మోకీళ్లు, వెన్నుముక, తుంటి ప్రాంతాలలో నొప్పి అని చెప్పే రోగులలో కనిపిస్తుంది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వెల్లడించే దాని ప్రకారం, విటమిన్‌డీ లోపం వల్ల ఆస్టియో ఆర్థరైటీస్‌ కనిపిస్తుంది. దీనితో పాటుగా లింగం,జన్యుపరమైన కారణాలు, ఊబకాయం వల్ల కూడా ఇది సంభవిస్తుంది.

లక్షణాలు మరియు కారణాలు

కీళ్లలో నొప్పి, కీళ్లు గట్టిపడటం వంటి లక్షణాలను ఆస్టియో అర్థరైటీస్‌ ప్రారంభ లక్షణాలుగా గుర్తిస్తారు. కాస్త ఎక్కువ శ్రమ పడితే అసౌకర్యం అధికంగా కలుగుతుంది. ఇతర లక్షణాలలో కీళ్ల వాపు, నడిచేటప్పుడు కీళ్ల దగ్గర శబ్దాలు రావడం, కీళ్ల వద్ద గట్టిగా కణితిలు ఉన్నట్లుగా ఉండటం వంటివి ఆస్టియోఫైట్స్‌ అభివృద్ధికి సూచికలుగా భావిస్తారు.

ఆస్టియో ఆర్థరైటీస్‌ రావడానికి గల కారణాలలో ఊబకాయం, నిశ్చల జీవనశైలి, సుదీర్ఘకాలం కూర్చున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోకపోవడం, తరచుగా బరువులు ఎత్తడం, ఫుట్‌బాల్‌ లేదంటే హాకీ లాంటి క్రీడల కోసం తరచుగా ప్రాక్టీస్‌ చేయడం వంటివి ఎముకల గాయాలు, కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. యుక్త వయసులో ఆస్టియో ఆర్థరైటీస్‌కూ ఇవి కారణమవుతున్నాయి.

చికిత్స

ఎక్స్‌రే , ఎంఆర్‌ఐ, రక్తపరీక్షలు, జాయింట్‌ ఫ్లూయిడ్‌ పరీక్షల ద్వారా సమస్యను గుర్తిస్తారు. ఈ పరీక్షలు నేరుగా ఆస్టియోఆర్థరైటీస్‌ను గుర్తించలేకపోవచ్చు కానీ ఈ స్ధితిని తెలుసుకోవచ్చు. ఈ స్థితి ఆధారంగా డాక్టర్లు మందులు, ఇతర చికిత్సలు సూచించడం చేయవచ్చు. ఈ ఆస్టియో ఆర్థరైటీస్‌కు ప్రామాణిక చికిత్సగా ఫిజియో థెరఫీ, ఆక్యుపేషనల్‌ థెరఫీ, ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌) ఉంటాయి.

వీటితో పాటుగా రోగులు ఉబకాయులు లేదంటే అధిక బరువు ఉంటే బరువు తగ్గడం, ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పరిస్థితులలో మార్పు లేని ఎడల శస్త్ర చికిత్స లేదంటే కార్టిసోన్‌ ఇంజెక్షన్లు , లుబ్రికేషన్‌ ఇంజెక్షన్లు, ఎముకలను రీఎలైనింగ్‌ చేయడం సూచిస్తారు. అప్పటికీ మార్పు లేకపోతే కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను సూచిస్తారు. అందువల్ల ఆర్థరైటీస్‌ లేదంటే కీళ్లలో అసౌకర్యపు తొలి లక్షణాలు కనిపిస్తే, స్పెషలిస్ట్‌ను సంప్రదించవలసినదిగా సూచించడమైనది.

- డాక్టర్‌ వీరేంద్ర ముద్నూర్‌, ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌


































Next Story