ఆ మ్యాచ్‌లో సచిన్ వెంటే అదృష్టం ఉంది
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 9:08 AM GMT2011 వన్డే ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా.. టీమ్‌ఇండియా గౌరవప్రదమైన స్కొర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో సచిన్ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. నాలుగు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చివరికి సెంచరీకి చేరువైన క్రమంలో అప్రిధి పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. తాజాగా ఆ నాటి మ్యాచ్ విషయాలను ఆనాటి భారత పేసర్ ఆశిష్ నెహ్రా అభిమానులతో పంచుకున్నాడు.
గ్రేటెస్ట్ రైవల్రీ పాడ్‌కాస్ట్ నెహ్రా లో మాట్లాడుతూ..' ఆ మ్యాచ్‌లో సచిన్ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ఆ మ్యాచ్‌లో నాలుగు సార్లు.. ఔటైయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాక్ ఫీలర్డు సచిన్ ఇచ్చిన క్యాచ్‌లను జారవిడిచారు. 25,45,70,81 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మిస్బా, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌లు నాలుగుసార్లు క్యాచ్‌లు జారవిడిచారు. మ్యాచ్‌లో అదృష్టం సచిన్ వెంటే ఉంది. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ జట్టు సెమీస్ చేరినా అది గొప్ప జట్టేనని.. ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యమని తెలిపాడు. మేం సెమీఫైనల్ చేరుకుని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించామని' నెహ్రా చెప్పుకొచ్చాడు.
మొహాలీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్ 85, సెహ్వాగ్ 38 పరుగులతో రాణించారు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మిస్భాబుల్ హక్ 56 పరుగులతో ఒంటరి పోరాడం చేశాడు. ఇక ఫైనల్‌లో భారత్.. శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తరువాత మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.