మీరు కమల్ హాసనే అయిండొచ్చు.. క్షమాపణలు చెప్పండి
కర్ణాటక హైకోర్టు నటుడు కమల్ హాసన్‌ను తీవ్రంగా విమర్శించింది.
By Medi Samrat
కర్ణాటక హైకోర్టు నటుడు కమల్ హాసన్‌ను తీవ్రంగా విమర్శించింది. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయాలని, ఇబ్బందులు లేకుండా ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు.
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ ప్రకటనకు క్షమాపణ చెప్పడానికి హాసన్ నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించారు. ఏ పౌరుడికీ మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని న్యాయమూర్తి అన్నారు. నీరు, భూమి, భాష పౌరులకు ముఖ్యమైనవని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం, మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పాలని కోర్టు సూచించింది.
ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను ప్రశ్నిస్తూ నటుడి వైఖరిని న్యాయమూర్తి విమర్శించారు. “ఏ భాషా మరొక భాష నుండి పుట్టదు. దీనికి మద్దతు ఇచ్చే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక ప్రజలు ఏమి అడిగారు? కేవలం క్షమాపణ మాత్రమే.” అని అన్నారు. జస్టిస్ నాగప్రసన్న కమల్ హాసన్ వాదనను ప్రశ్నించారు. “ఈ పరిస్థితులను కమల్ హాసన్ సృష్టించారు, ఆయన క్షమాపణ చెప్పనని అన్నారు? మీరు కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు.. దేని ఆధారంగా? మీరు చరిత్రకారుడా? లేదా భాషావేత్తనా?” అంటూ ప్రశ్నలు వేశారు.