మహిళలతో అలాంటి డ్యాన్స్‌లు చేయిస్తారా? టాలీవుడ్‌కు మహిళా కమిషన్ వార్నింగ్

టాలీవుడ్ సినిమాల్లో మహిళలతో కంపోజ్ చేయించే డ్యాన్సులు హద్దులు దాటుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

By Knakam Karthik
Published on : 20 March 2025 1:53 PM IST

Cinema News, Hyderabad, Tollywood, Entertainment, Womens Commission

మహిళలతో అలాంటి డ్యాన్స్‌లు చేయిస్తారా? టాలీవుడ్‌కు మహిళా కమిషన్ వార్నింగ్

టాలీవుడ్ సినిమాల్లో మహిళలతో కంపోజ్ చేయించే డ్యాన్సులు హద్దులు దాటుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసింది. 'తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది.

మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటాం.అని.. రాష్ట్ర మహిళ కమిషన్ ప్రకటన విడుదల చేసింది..

అయితే.. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌ కంపోజ్ చేసిన స్టెప్పులు వివాదాస్పదమయ్యాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌ లో కొన్ని స్టెప్స్ వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల నితిన్ హీరోగా నటించినా.. రాబిన్ హుడ్ మూవీలో కేతిక శర్మ వేసిన స్టెప్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మహిళా లోకం మండిపడిన విషయం తెలిసిందే. ఈ పాటలో కేతిక శర్మతో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేతిక వేసుకున్న మిడ్డీ ఎలాస్టిక్‌ని ముందుకి లాగుతూ, ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ స్టెప్పులు వేయించాడు శేఖర్ మాస్టర్. ఐటెం సాంగ్ పేరుతో ఇలాంటి వల్గర్ స్టెప్పులు వేయిస్తున్నారంటూ శేఖర్ మాస్టర్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

Next Story