2024లో అమరన్, మహారాజా, గరుడన్ వంటి అనేక తమిళ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రం ఈ ఏడాది అసలు కలిసిరాలేదు. 2024లో తమిళ చిత్ర నిర్మాతలు దాదాపు 3000 కోట్ల రూపాయలను సినిమాలు తీయడానికి ఖర్చు చేశారు, అయితే నిర్మాతలు, పంపిణీదారులు దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది విడుదలైన 241 చిత్రాలలో కేవలం 18 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. 223 చిత్రాలు ఘోరంగా విఫలమయ్యాయి.
కోలీవుడ్ 2025లో మంచి హిట్స్ అందుకోవాలని ఆశిస్తోంది. కొందరు కంటెంట్ పై మరింత దృష్టి పెడుతూ ఉండగా, మరికొందరు బడ్జెట్‌పై దృష్టి పెడుతున్నారు. నిర్మాతలు 1,000 కోట్ల నష్టానికి కారణమైన ప్రధాన కారణాల్లో అనేక భారీ బడ్జెట్ చిత్రాలు ప్లాప్ అవ్వడమే. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్‌లతో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పాన్-ఇండియన్ చిత్రం కంగువ 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నమ్మకంతో భారతదేశం అంతటా విస్తృతంగా ప్రమోట్ చేశారు. దురదృష్టవశాత్తూ కంగువ కేవలం షాకింగ్ 106 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించగలిగింది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అది బాక్సాఫీస్ వద్ద కేవలం 150 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రజనీకాంత్ వేట్టైయాన్ కూడా కోలీవుడ్‌ను కాపాడలేకపోయింది. ఇలా భారీ స్టార్స్ ఉన్న సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.