'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రానా దగ్గుబాటి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని, హైదరాబాద్‌ను భారతదేశానికి సినిమా రాజధానిగా మార్చడానికి సహకరిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. తాను సినీ పరిశ్రమలో అనేక మంది వ్యక్తులతో పనిచేశానని, అయితే పవన్ కళ్యాణ్ నిజంగా ప్రత్యేకమని చెప్పాడు. 'నా రాబోయే సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది' అని రానా దగ్గుబాటి అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులను కొనియాడిన రానా, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉన్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
"చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు కల్వకుంట్ల రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల మీ సానుకూల దృక్పథం మాకు ఎదుగుదలకు తోడ్పడుతుంది. హైదరాబాద్‌ను భారతదేశ చలనచిత్ర రాజధానిగా మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను" రానా అన్నారు. ఫిబ్రవరి 25న విడుదల కానుండగా, పవన్, రానా నటించిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ గ్రౌండ్స్‌లో జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ముఖ్య అతిధులుగా 'భీమ్లా నాయక్' నిర్మాతలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ 'భీమ్లా నాయక్' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.