గొంతు కోస్తా.. కమల్ హాసన్‌కు బుల్లితెర నటుడు బెదిరింపులు.!
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు.
By Medi Samrat
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆయన సినిమాల వల్లనో, రాజకీయపరమైన కారణాలతో వార్తల్లోకి రాలేదు. కమల్ హాసన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. మరి కమల్‌ను బెదిరించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కమల్ హాసన్‌ను బెదిరిస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. తమిళ నటుడు రవిచంద్రన్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిచంద్రన్ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. కమల్ అనుభవం లేని రాజకీయవేత్త అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా కమల్‌ను బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కమల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు.. కమల్ గొంతు కోస్తానని రవిచంద్రన్ అన్నారు.
రవిచంద్రన్ బెదిరింపుతో కమల్ అభిమానులు షాక్ అయ్యారు. అంతే కాదు కమల్ పార్టీ కార్యకర్తలు దీనిపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్‌కు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల గురించి మాట్లాడితే.. ఈ రోజు విద్య మాత్రమే దేశాన్ని మార్చగల ఆయుధం. నియంతృత్వం, సనాతన సంకెళ్లను ఛేదించగల ఏకైక ఆయుధం విద్య. నువ్వు ఏ ఆయుధాన్ని తీసుకోకు, చదువు చాలు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ సూర్య ఎన్జీవో 15 ఏళ్ల వేడుకకు హాజరైన సందర్భంగా కమల్ హాసన్ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు దీనిపై దుమారం చెలరేగడంతో పాటు కమల్ కూడా ట్రోల్ అవుతున్నారు.