ఉత్తర, దక్షిణాది నటుల మధ్య హిందీ భాషా వివాదం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ కథానాయకుడు కిచ్చ సుదీప్ ల మధ్య ట్విట్టర్ సంభాషణ సాగగా.. పలువురు ప్రముఖులు కూడా ఈ చర్చపై తమ తమ అభిప్రాయాలు తెలిపారు. తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీనే మన జాతీయ భాష అని స్పష్టం చేసింది. అప్పటికీ, ఇప్పటికీ, ఇంకెప్పటికైనా హిందీనే జాతీయ భాష అంటూ ట్వీట్ చేసిన అజయ్ దేవగణ్ కు మద్దతు పలికింది.
హిందీని జాతీయ భాషగా అంగీకరించకపోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని తెలిపింది. సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని కంగనా వెల్లడించింది. హిందీ, ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్ తదితర భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి పుట్టుకొచ్చినవేనని , సంస్కృతాన్ని మన భారత జాతీయ భాషగా ఎందుకు ప్రకటించకూడదు? స్కూళ్లలో సంస్కృతాన్ని ఎందుకు తప్పనిసరి చేయకూడదు? అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
హిందీ భాష వివాదంలో హీరో సుదీప్‌కు కర్నాటక నేతలు, ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి సుదీప్‌కు మద్దతు ప్రకటించారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సుదీప్ సంచలన కామెంట్స్ చేశాడు. హిందీ ఇక నుంచి ఏ మాత్రం జాతీయ భాష కాదంటూ చెప్పుకొచ్చారు సుదీప్.