నటుడు వివేక్ ఒబెరాయ్ దారుణంగా మోసపోయాడు. దీంతో వివేక్ ఒబెరాయ్, అతని భార్య ప్రియాంక పోలీసులను ఆశ్రయించారు. 1.55 కోట్ల రూపాయలు మోసపోయామని చెబుతున్నారు. నమ్మిన స్నేహితులే మోసం చేశారని అంటున్నారు. వ్యాపార భాగస్వాములు మోసం చేశారని, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 34, 409, 419, 420 కింద వివేక్ ప్రతినిధి దేవెన్ బఫ్నా చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అనంతరం అంధేరి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఒక ఈవెంట్, చిత్ర నిర్మాణ సంస్థ కోసం డబ్బులు తీసుకున్నారు పార్ట్నర్స్. ఆ డబ్బును వాళ్లు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఎంఐడీసీ పోలీసులు బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో సినీ నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులు సంజయ్ సాహా, అతని తల్లి నందితా సాహా, రాధిక నంద ఉన్నారు. వివేక్ CA దేవెన్ బఫ్నా మాట్లాడుతూ.. 2017 సంవత్సరంలో వివేక్ ఒబెరాయ్ తన భార్య ప్రియాంక అల్వాతో కలిసి ఒక కంపెనీని ప్రారంభించాడని.. కానీ కంపెనీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. కొంతమంది కొత్త భాగస్వాములను కూడా చేర్చుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో ఓ సినీ నిర్మాత కూడా ఉన్నారు. అంతా కలిసి ఈ కంపెనీని రద్దు చేసి ఈవెంట్ బిజినెస్ కంపెనీగా మార్చడానికి అంగీకరించారు. వివేక్ ఈ ప్రాజెక్ట్‌లో రూ. 1.55 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ మొత్తాన్ని పార్టనర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని తెలిపారు. ఒబెరాయ్ తన వాటాలను మరో కంపెనీ ఒబెరాయ్ మెగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ మోసం బయట పడిందని తెలిపారు.