షూటింగులో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమారన్
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లొకేషన్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో 'విలయత్ బుద్ద'
By అంజి Published on 26 Jun 2023 9:29 AM IST
షూటింగులో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమారన్
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లొకేషన్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో 'విలయత్ బుద్ద' అనే మూవీలో నటిస్తున్నాడు. ఆదివారం నాడు ఉదయం 10.30 గంటల సమయంలో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఫైట్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఆయన జారీ కిందపడ్డారు. సుకుమారన్ కాలికి గాయమైంది. మరయూర్ బస్టాండ్‌లో 'విలాయత్ బుద్ధ' సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడిన సుకుమారన్‌ను వెంటనే కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన కాలికి కీహోల్ సర్జరీ చేయనున్నారు. సుకుమారన్ కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
పృథ్వీరాజ్ సుకుమార్ గాయపడిన విషయం నెట్టింట వైరల్ అయింది. ఆయన గాయం నుంచి త్వరగా కోలుకోవాలి అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ సుకుమారన్‌కు సందేశాలు అందిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పృథ్వీరాజ్ మెయిన్ రోల్‌లో జయన్ నంబియార్ దర్శకత్వంలో ‘విలాయత్ బుద్ధ’ సినిమా తెరకెక్కుతోంది. మరయూర్‌లో గంధపు చెక్కల దోపిడీకి సంబంధించిన స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఇందు గోపన్, రాజేష్ పిన్నాడన్ స్క్రీన్ ప్లే రాయగా, ఊర్వశి థియేటర్స్ బ్యానర్‌పై సందీప్ సేనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్‌కు కూడా సుపరిచితుడే. 2022లో బ్రో డాడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత జన గణ మన, గోల్డ్, కాపా లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్‌లో హీరోగా నటించింది పృథ్వీరాజే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ వరదరాజ మన్నార్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మువీ నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ కూడా విడుదల అయ్యింది.