వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం..!
Vakeel Saab Pre Release Event. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. .
By Medi Samrat Published on 4 April 2021 4:31 PM ISTపవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. ఏప్రిల్ 9న సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని శిల్ప కళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించాలని భావించారు. అందుకు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని భావించింది. ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులకు అనుమతి మంజూరు కోరుతూ లేఖ రాశారు.
కోవిడ్–19 నేపథ్యంలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు లేఖ రాశారని.. తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని స్పష్టం చేశారు.
దీంతో లొకేషన్ శిల్పకళా వేదికకు షిఫ్ట్ అయింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడా అని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్ కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్నారు.
కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్టు ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఫ్యాన్స్ పాసులతో రావాలని, మాస్కు లేకపోతే ప్రవేశం నిషిద్ధం అని స్పష్టం చేశారు. బాలీవుడ్ చిత్రం పింక్ ను తెలుగులో వకీల్ సాబ్ పేరిట తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.