పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా థియేటర్లలో బాగానే ఆడింది. అటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ ఓనర్లకు మంచి లాభాలనే తీసుకుని వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు జనం వెళ్లడమే మానేశారు. 50 శాతం ఆక్యుపెన్సీతో ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లను నడుపుకోవచ్చు అని చెప్పినప్పటికీ కరోనా కేసుల దృష్ట్యా జనం సినిమా హాళ్లకు వెళ్లాలని అనుకోవడం లేదు. ఇక సినిమా ఓటీటీలో విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ౩౦ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ట్విటర్‌లో పేర్కొంది. బాలీవుడ్ చిత్రం పింక్ ను తెలుగులో వకీల్ సాబ్ పేరిట తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగిపోయే అవకాశం ఉండడంతో పలు సినిమాలు కూడా ఓటీటీల బాట పట్టాయి.