చిరంజీవితో కేంద్రమంత్రి భేటీ.. దేనికి సంకేతం?

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. మెగాస్టార్ చిరంజీవిని మార్యదపూర్వకంగా కలిశారు. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున,

By అంజి  Published on  27 Feb 2023 6:45 AM GMT
Union Minister Anurag Thakur, Chiranjeevi, Nagarjuna, Hyderabad, Tollywood

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను చిరంజీవి సన్మానిస్తున్న చిత్రం

హైదరాబాద్‌: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానిక వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. మెగాస్టార్ చిరంజీవిని మార్యదపూర్వకంగా కలిశారు. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా అక్కడ కనిపించారు. నిన్న హైదరాబాద్ వచ్చిన అనురాగ్ ఠాకూర్ ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లాడు. చిరంజీవి నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్‌లో కొన్ని చిత్రాలను షేర్ చేస్తూ వెల్లడించారు. సినీ రంగానికి సంబంధించి పలు విషయాలపై వీరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చి తనను కలవడానికి సమయం కేటాయించిన కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ, అది సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలిసి తాము జరిపిన సంతోషకరమైన చర్చ ఎంతో సంతోషం కలిగించాయని మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు. తన నివాసానికి చేరుకున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను చిరంజీవి శాలువాతో సత్కరించారు. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. గోవాలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐలో 'పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించినందుకు కృతజ్ఞతగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కి మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్పాహార సమావేశాన్ని నిర్వహించినట్లు అనిపించింది.

అయితే చిరంజీవితో నిరంతరం టచ్‌లో ఉండటం ద్వారా చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సినీ సెలబ్రిటీలు, క్రికెట్‌ స్టార్లను తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ జరిగిందని అంటున్నారు.

తన నివాసానికి వచ్చినందుకు అనురాగ్ ఠాకూర్‌కి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి, సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చిత్ర పరిశ్రమ గురించి మీతో చర్చలు జరపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. వర్క్ ఫ్రంట్‌లో చిరంజీవి చివరిసారిగా వాల్తేరు వీరయ్యలో ప్రధాన పాత్రలో కనిపించారు. దీనిలో అతను శృతి హాసన్‌తో స్క్రీన్ షేర్‌ చేసుకున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్ర పోషించారు. మరోవైపు, నాగార్జున యాక్షన్ డ్రామా వైల్డ్ డాగ్‌లో కనిపించారు.

Next Story