పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న అభిమానులపై భారీ సౌండ్ స్పీకర్ విరిగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.
భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో ‘ఓజీ’ ప్రీమియర్ షో సమయంలో గోడకు బిగించిన స్పీకర్లు ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. నేరుగా ప్రేక్షకుల మధ్యలో పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రేక్షకులు, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. థియేటర్ సామర్థ్యానికి మించి దాదాపు 1200 మందిని లోపలికి అనుమతించారని, వారి ప్రాణాలతో చెలగాటమాడారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.