మంత్రితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ
టాలీవుడ్ నిర్మాతల సంఘం ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డిని కలిశారు.
By Medi Samrat Published on 19 Dec 2023 8:46 PM IST
టాలీవుడ్ నిర్మాతల సంఘం ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిల్ రాజు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ప్రసన్న, సి కళ్యాణ్, సుధాకర్ రెడ్డి తదితరులు మంత్రిని కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతం నెలకొన్న కొత్త సమస్యలను, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని వీరు మంత్రిని కోరారు .మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి.. ఈ విషయాలన్నిటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రిని 24 విభిన్న క్రాఫ్ట్‌లకు చెందిన తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కలవనున్నారు.
కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. తనకు మంత్రి పదవి దక్కడంపై దిల్ రాజు తప్ప పరిశ్రమ నుంచి ఎవరూ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పెద్దలు ఆయన్ను కూల్ చేయడానికి ప్రయత్నించారు. మిమ్మల్ని కలవాలని ప్లాన్ చేస్తున్నామని, త్వరలో కలిసి వచ్చి కలుస్తామని వివరించారు. చెప్పినట్లుగానే తాజాగా ఆయనను కొందరు పెద్దలు కలిశారు.