టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూత‌

Tollywood Producer Jakkula Nageswara Rao passed away.టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 8:53 AM IST
టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి వంటి ప్ర‌ముఖుల మ‌ర‌ణాల‌ను జీర్ణించుకోక‌ముందే మ‌రో దిగ్భ్రాంతిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ జ‌క్కుల నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూశారు. గురువారం విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 46 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఓ కుమారుడు, కుమారై ఉన్నారు.

కృష్ణా జిల్లా నెప్ప‌ల్లిలోని బంధువుల ఇంటికి నాగేశ్వ‌ర‌రావు వెళ్లారు. తిరిగి గుడివాడ‌కు కారులో వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో కారు టైరులో గాలి కొట్టించేందుకు ప‌మిడిముక్క‌ల మండ‌లం తాడంకి వ‌ద్ద ఉన్న ఓ టైర్ల షాపు ఎదుట ఆగారు. రోడ్డు ప్ర‌క్క‌న నిల‌బ‌డి ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో మ‌చిలీప‌ట్నం నుంచి విజ‌య‌వాడ వైపు వెలుతున్న ఓ వాహ‌నం నాగేశ్వ‌ర‌రావును వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో నాగేశ్వ‌ర‌రావు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో మరోసారి విషాద చాయ‌లు అలముకున్నాయి. నిర్మాత మృతికి సినీ నటీనటులు, దర్శక-నిర్మాతలు సంతాపం తెలుపుతున్నారు. 'లవ్ జర్నీ', 'అమ్మా నాన్న ఊరెళితే', 'వీడు సరైనోడు' వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశారు.

Next Story